చేతులు మారి.. పక్కదారి! | - | Sakshi
Sakshi News home page

చేతులు మారి.. పక్కదారి!

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

జోరుగా సన్న బియ్యం దందా!

డీలర్లు, మిల్లర్లే పాత్రధారులు

అడుగడుగునా దోపిడీ.. రూ. లక్షల్లో రాబడి

మామూళ్ల మత్తులో అధికారులు

‘తిలా పాపం.. తలా పిడికెడు’ అన్నట్లు సాగుతోంది జిల్లాలో రేషన్‌ దందా. నిరుపేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలన్న సర్కార్‌ సంకల్పం.. అక్రమార్కులకు వరంగా మారింది. డీలర్లు, కాంట్రాక్టర్లు, మిల్లర్లు, వ్యాపారులు కొక్కులుగా మారి సన్న బియ్యం బొక్కుతున్నారు. ఆటోలు, డీసీఎంలు, లారీల్లో రేషన్‌ బియ్యం రవాణ జరుగుతున్నా, అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారన్న ఆరోపణలున్నాయి.

– మెదక్‌ అర్బన్‌

రేషన్‌ బియ్యం పంపిణీలో అడుగడుగునా అవినీతి కనిపిస్తుంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి తూకం చేసి.. డీలర్లకు రేషన్‌ ఇవ్వాల్సిన అధికారులు.. సంచుల లెక్కన రేషన్‌ షాపులకు రవాణ చేస్తున్నారు. అయితే 50 కిలోల బస్తాలో సుమారు 2 నుంచి 4 కిలోల తరుగు ఉంటుందన్న ఆరోపణలున్నాయి. గత కొంత కాలంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే కొంతమంది రైతులు, ఇతర వర్గాల వారు, ముఖ్యంగా పట్టణవాసులు వాటిని తినడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో తమ కోటాను సంబంధిత రేషన్‌ డీలర్‌కు, ఇతర వ్యాపారులకు కిలో రూ. 20 చొప్పున అమ్ముకుంటున్నారు. అక్కడి నుంచి వీరు మిల్లర్లకు రూ. 26 నుంచి 28 వరకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు సీఎంఆర్‌ కింద తమకు వచ్చిన సన్న వడ్లను, పెద్ద మిల్లులకు రూ.2,900 క్వింటాల్‌ చొప్పున అమ్ముకుంటున్నారు. వారు మిల్లింగ్‌ చేసి సూపర్‌ ఫైన్‌ బియ్యంగా మార్చి క్వింటాల్‌కు రూ. 4,600కు విక్రయిస్తున్నారు. అలాగే మిల్లింగ్‌ చేయడం ద్వారా క్వింటాల్‌ వడ్లకు సుమారు రూ.500కు పైగా ఉప ఉత్పత్తుల నుంచి లాభం వస్తున్నట్లు తెలుస్తుంది. వ్యాపారులు, రేషన్‌ డీలర్ల ద్వారా కొనుగోలు చేసిన రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేసి సీఎంఆర్‌ కింద ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఈ క్రమంలో అన్నివర్గాల వారు లాభపడుతున్నారు.

వరంగా మారిన 3 నెలల కోటా

జిల్లాలో 520 రేషన్‌ షాపులు, 2,39,217 రేషన్‌ కార్డులు, 7,81,389 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈసారి మూడు నెలల కోటా కింద 14050.369 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. దీంతో అక్రమ బియ్యం రవాణ జోరందుకుంది. ఇటీవల తూప్రాన్‌ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం లారీ, పాపన్నపేట శివారులో మరో లారీని పట్టుకొని, కేసులు నమోదు చేశారు. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు మొత్తం 11 కేసులు నమోదైనట్లు సమాచారం. అలాగే ఈనెల 15న తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌లోని రేషన్‌ షాపును విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీ చేయగా, 12.68 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement