నేటి నుంచి సంక్షేమ వారం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సంక్షేమ వారం

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

మెదక్‌ కలెక్టరేట్‌: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లాలో నేటి నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సంక్షేమ హాస్టళ్లను సందర్శించి వాటిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించనున్నారు. ఈమేరకు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఇటీవల అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు.

ఏడు రోజులపాటు

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసందర్భంగా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. వంట గదులు, పరిసరాల పరిశుభ్రతతో పాటు ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయిస్తారు.

విద్యార్థులకు పోటీలు

విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. క్విజ్‌, విద్య విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్‌ పోటీలు నిర్వహించనున్నారు. అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కల్పిస్తారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఈసందర్భంగా విద్యార్థుల చదువు తదితర అంశాలపై చర్చిస్తారు.

ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు

సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 235 ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జూన్‌ 2 వరకు మరో 1,500 ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి మాణిక్యం తెలిపారు.

ఏర్పాట్లు పూర్తి

సంక్షేమ వారం కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి సంక్షేమ వారాన్ని సక్సెస్‌ చేయాలని సూచించారు. వారం రోజులపాటు సంక్షేమ హాస్టళ్లలో పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే వందశాతం ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ వందశాతం పూర్తి చేయించాలన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం

విద్యార్థులకు వివిధ పోటీలు

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

Advertisement
 
Advertisement
Advertisement