కల్యాణలక్ష్మి ఏమాయె? | - | Sakshi
Sakshi News home page

కల్యాణలక్ష్మి ఏమాయె?

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకానికి గ్రహణం పట్టింది. పెళ్లిళ్లయి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి నయా పైసా రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇంకా ఎప్పడిస్తారంటూ లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

– మెదక్‌జోన్‌

జిల్లాలో మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏడాది కాలంగా 1,434 కల్యాణలక్ష్మి షాదీముబారక్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా మెదక్‌ డివిజన్‌లో 934 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, తూప్రాన్‌, నర్సాపూర్‌ డివిజన్లలో సుమారు 500 ఉన్నాయి. వీటిలో ఎమ్మెల్యే అనుమతితో పాటు ఆయా తహసీల్దార్ల పరిశీలనలో మరిన్ని పెండింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని బిల్లులు కోసం ట్రెజరీలో ఉన్నట్లు తెలిసింది. కాగా ఏడాదిగా ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల కాకపోవడంతో పేదింటి వధువుల తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పటం లేదు. ఈపథకం ప్రారంభమైన పుష్కరకాలం నుంచి ఇప్పటివరకు ఏడాది పాటు దరఖాస్తులు ఎప్పడూ నిలిచిపోలేదని, ఆరు నెలల్లోపు లబ్ధిదారులకు పెళ్లి కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం నిధులు వధువు తల్లి ఖాతాల్లో జమయ్యేవని పలువురు పేర్కొంటున్నారు. కాగా పెళ్లి అంటేనే బంగారంతో ముడిపడి ఉంటుంది. మధ్య తరగతి వారు పెళ్లి చేస్తే వధువుకు కనీసం 3 నుంచి 5 తులాల బంగారు పుస్తెల తాడుతో పాటు ఇతర ఆభరణాలు వేస్తారు. ప్రస్తుతం తులం బంగారం ధర మార్కెట్‌లో రూ.1.52 లక్షల పైచిలుకు ఉంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం అందించే సాయం కొంత వరకై నా ఉపయోగపడేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

సాయం కోసం లబ్ధిదారుల ఎదురుచూపు

ఏడాదిగా పెండింగ్‌

జిల్లాలో 1,400 పైచిలుకు దరఖాస్తులు

ఏడాది గడిచిపోయింది

నాకూతురు పెళ్లి కోసం అప్పు చేశా. పెళ్లి అయిన వెంటనే కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటివరకు సాయం మంజూరు కాలేదు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా నిధులు రావడం లేదని చెబుతున్నారు.

– ముండ్రాతి వెంకటి, చందంపేట

Advertisement
 
Advertisement
Advertisement