ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు
● 23 వరకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశం
● జిల్లాలో 21 జెడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలు
మెదక్ అర్బన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈనెల 23 వరకు ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బీసీ రిజర్వేషన్ల అమలు నేపథ్యంలో ఏర్పడిన వివాదం ఫలితంగా ఆగిన ఎన్నికలను కోర్టు తీర్పునకు లోబడి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 21 జెడ్పీటీసీ, 21 ఎంపీపీ, 190 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
సెప్టెంబర్‌లో ప్రక్రియ చేపట్టినా..
రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని భావించి గత సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈమేరకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. కానీ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అప్పట్లో ఎన్నికలు ఆగిపోయాయి. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఈక్రమంలో 10 జూలై 2025 నుంచి 5 ఫిబ్రవరి 2026 వరకు టీపోల్‌లో నమోదైన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకొని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించాలి. వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలి. ఈ మేరకు చివరి లిస్టు తయారు చేసి, ఈనెల 23 వరకు ఎన్నికల కమిషన్‌కు పంపాలని సర్కులర్ జారీ అయింది. వాటిని ఆమోదించిన తర్వాత ముసాయిదా జాబితాలను గ్రామాల వారీగా విడుదల చేస్తారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకొని తుది జాబితా విడుదల అవుతుంది. దీంతో జిల్లా అధికారులు ఓటర్ల జాబితాలను తయారు చేసే పనిలో పడ్డారు.
జూన్‌లో ఎన్నికలు!
మండుతున్న ఎండలు, జనగణను దృష్టిలో పెట్టుకొని జూన్, జూలైలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 2019లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగగా జూన్ 2025తో వారి పదవీకాలం ముగిసింది. అప్పటినుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. కాగా కోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్వహించిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచిన నేపథ్యంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత డిసెంబర్ నాటికి జిల్లాలో 5,24,451 ఓటర్లు ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య మారే అవకాశం ఉంది.


