మెదక్ కలెక్టరేట్: మెదక్ బల్దియాలో కో–ఆప్షన్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. కౌన్సిల్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు శనివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అధికార కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్ రాగి వనజ, మాజీ సర్పంచ్ కొర్విరాములు, తాయర్ అలీ నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్‌తో కలిసి నామినేషన్ పత్రాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. కాగా మెదక్ బల్దియాలో 4 కో అప్షన్ సీట్లు ఉన్నాయి. ఇందులో రెండు జనరల్ (ఒకటి మహిళ, మరొకటి పురుషులకు), జనరల్ సీట్లకు మాజీ కౌన్సిలర్లు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్‌లు పోటీ చేయవచ్చు. రెండు ముస్లిం మైనార్టీలకు కేటాయించారు. వారిలో ఒకరు మహిళ, మరొకటి పురుషులకు రిజర్వ్ చేశారు. అధికార పార్టీతో పాటు ఏ పార్టీకి చెందిన మాజీలు పోటీ చేయవచ్చు. ముస్లిం మైనార్టీల్లో పార్టీలకు సంబంధం లేకుండా ఎవరైన సరే పోటీ చేయడానికి అర్హులు.
అధికార పార్టీకే అవకాశాలు
అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, అధికార పార్టీకి చెందిన అభ్యర్థులే కో ఆప్షన్ సభ్యులుగా గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం పదవిలో ఉన్న కౌన్సిల్ సభ్యులు ఓటువేసి కో అప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. ఈనెల 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, మొదటి రోజు కాంగ్రెస్ నుంచి మూడు నామినేషన్లు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదని, ఆదేశాలు రాగానే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
మెదక్ బల్దియాలో నాలుగు సీట్లు
మొదటిరోజు 3 నామినేషన్లు
రేపే ఆఖరు


