నీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

మెదక్‌ కలెక్టరేట్‌: వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని, ప్రతి సర్పంచ్‌ గ్రామానికి లీడర్‌గా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్‌ చట్టంలోని నిబంధనలకు లోబడి గ్రామ పాలన సాగాలని, ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ సమన్వయంతో గ్రామంలో సుపరిపాలన అందించాలని కోరారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు మోడల్‌గా తీర్చిదిద్దాలని, గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాలకు నూతన భవనాల ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ల సమన్వయంతో గ్రామ పంచాయతీలో పాలన సవ్యంగా నడవాలన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, 15 ఆర్ధిక సంఘం నిధులను అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించిందని తెలిపారు. వాటితో గ్రామాల్లో సమస్యలు లేకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. నిధుల వినియోగంలో అక్రమాలకు తావులేదన్నారు. నిధులు సక్రమంగా వినియోగించకపోతే అక్రమాలు జరిగితే సర్పంచ్‌ , కార్యదర్శులపై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, మిషన్‌ భగీరథ ఈఈ సంపత్‌ కుమార్‌, గ్రిడ్‌ డీఈ నాగభూషణం, డీఎల్పీఓలు సాయిబాబు, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సర్పంచులు, కార్యదర్శులకు

కలెక్టర్‌ ఆదేశం

నిధులు దుర్వినియోగం చేస్తే

కఠిన చర్యలు

Advertisement
 
Advertisement
Advertisement