బడ్జెట్‌లో కొత్త పింఛన్ల ప్రకటనపై వృద్ధుల్లో నిరాశ
‘పాపన్నపేట మండలం గాంధారిపల్లికిచెందిన అంకిడి మరియమ్మ భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. మరుసటి ఏడాది ఒక్కగానొక్క కొడుకు ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిల్లు అయ్యాయి. ప్రస్తుతం ఉపాధిహామీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. నాలుగేళ్లుగా వృద్ధాప్య పింఛన్ కోసం ఎదురుచూస్తోంది. అయినా అతీగతి లేదు’ ఇలా జిల్లాలో వేలాది మంది పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా వారి వేదన అరణ్య రోదనే అవుతుంది.
మెదక్ అర్బన్: పండుటాకుల ఆశలపై బడ్జెట్ నీళ్లు చల్లింది. సామాజిక పింఛన్లకు గతేడాది బడ్జెట్‌నే ప్రతిపాదించారు. అయితే అర్హులైన వారికి రెండు లక్షల కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. అంటే 2023 డిసెంబర్ చివరి నుంచి గత నెల చివరి వరకు వివిధ కేటగిరిల కింద పింఛన్ పొందుతున్న వారిలో మరణించిన వారు, అనర్హులు, ఇతర కారణాలతో పింఛన్లు కోల్పోయిన వారి స్థానంలో అర్హులైన కొత్తవారికి ఇచ్చే అవకాశం. ఈలెక్కన చూస్తే మండలానికి 10 పింఛన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల హామీలో ఇచ్చినట్లుగా వివిధ రకాల పింఛన్లు రూ. 2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లు రూ.4,016 నుంచి రూ.6 వేలకు పెంచే అవకాశం కూడా కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు.
జిల్లాలో 1,09,116 పింఛన్ పొందుతున్న వారు ఉన్నారు. వీరికి నెల నెలా రూ.24,92,56,832 పంపిణీ చేస్తున్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 35,846, వితంతు 43,515, దివ్యాంగ 7,997, గీత కార్మికులు 838, చేనేత 447, ఫైలే రియా 455, డయాలిసిస్ 160, బీడీ కార్మికులు 15,656, ఒంటరి మహి ళలు 4,102 మంది ఉన్నారు.
నాలుగేళ్లుగా దరఖాస్తుల పెండింగ్
గతంలో 61 ఏళ్లు ఉన్న వృద్ధాప్య పింఛన్ వయస్సును 57 ఏళ్లకు తగ్గించారు. ఆగస్టు 2022లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు డీఆర్డీఓ కార్యాలయంలో 1,287 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సైట్ ఓపెన్ కాకపోవడంతో తీసుకున్న దరఖాస్తులు పంచాయతీ కార్యదర్శుల వద్ద, మండల పరిషత్ కార్యాలయాల్లో కుప్పలు, తెప్పలుగా పడి ఉన్నాయి. మొత్తం మీద జిల్లాలో సుమారు 10 వేలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
మండలానికి 10 మందికి మాత్రమే వచ్చే అవకాశం!
జిల్లాలో వేలాది మంది ఎదురుచూపు


