కొల్చారం(నర్సాపూర్): మెదక్– నర్సాపూర్– హైదరాబాద్(బాలానగర్) 765డీ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. మండల పరిధిలో ఒకేలేన్‌గా ఉన్న ఈరోడ్డును విస్తరణలో భాగంగా 2021లో రెండు వరసల్లో జాతీయ రహదారిగా విస్తరించారు. మండల శివారులోని లోతు వాగు నుంచి రాంపూర్ వరకు మలుపులతో కూడి ఉన్న ఈ జాతీయ రహదారి ప్రస్తుతం వాహనదారుల పాలిట మృతిదారిగా తయారైంది. గడిచిన వారం రోజుల్లో ఆరుగురు ఈ రహదారిపై వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈనెల 14న రంగంపేటకు ఓ శుభకార్యానికి వచ్చిన హవేళిఘణాపూర్ వాసులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈనెల 18న పోతంశెట్టిపల్లి వద్ద మెదక్ వైపు నుంచి వస్తున్న ఆటోను వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు దుర్మరణం చెందారు. తాజాగా శనివారం బైక్‌పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఐఎంఎల్ డిపోకు చెందిన నగేశ్ మృత్యువాతపడ్డాడు.
అతివేగమే ప్రమాదాలకు కారణం!
అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు చోట చేసుకుంటున్నాయని పోలీసుల విచారణలో తేలింది. దీనికి తోడు జాతీయ రహదారి మధ్యలో డివైడర్ లేకపోవడం, మలుపులు కూడా ఉండడం మరో కారణంగా తెలుస్తోంది. ఇదే విషయమై కొల్చారం ఎస్‌ఐ మహమ్మద్ మైనొద్దీన్‌ను ఆరా తీయగా.. రోడ్డుపైకి వచ్చే ముందు వాహనాలు నడిపే వ్యక్తులు జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహ నాల వేగాన్ని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఇదే సమయంలో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన గాయాలై చనిపోతున్నారు. వాహనదారులు జాగ్రత్తలు వహిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయన్నారు.
ప్రమాదాలకు నిలయంగాఎన్‌హెచ్– 765డీ
వారంలో ఆరుగురు మృత్యువాత


