సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత రెండో సారి సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నర్మేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు. అక్కడే వర్చువల్‌గా పలువాటికి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రూ.300 కోట్ల వ్యయంతో పామాయిల్ ఫ్యాక్టరీని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. గంటకు 120 టన్నుల పామాయిల్ గెలలను క్రష్ చేసి నూనె తీయనుంది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ఈనెల 19న రైతు మహోత్సవ ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల పోటాపోటీ నినాదాలతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ముందస్తు చర్యలలో భాగంగా ఐజీ చంద్రశశేఖర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభ ఏర్పాట్లను ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కలెక్టర్ హైమావతి, ఐజీ చంద్రశేఖర్, సీపీ రష్మీ పెరుమాళ్ పర్యవేక్షించారు. 900 మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను గుర్తించి ముందస్తుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
పటిష్ట బందోబస్తు
నంగునూరు(సిద్దిపేట): నర్మేటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి తోపాటు ఇంటెలిజెన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరిమాళ్ తోపాటు భద్రతా సిబ్బంది, పోలీస్ అధికారులతో సమాలోచన చేశారు. సీఎం రేవంత్ హెలికాప్టర్‌లో వచ్చి.. తిరిగి రోడ్డు మార్గంలో వెళ్లే అవకాశం ఉండటంతో సిద్దిపేట నుంచి ఫ్యాక్టరీ వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.
ఏర్పాట్లపై మంత్రుల ఆరా
మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్ సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఐజీ, కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు
పోలీసుల పటిష్ట బందోబస్తు


