ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ కలెక్టరేట్: పోలీస్‌శాఖ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని, చట్టపరంగా అందరికీ న్యాయం చేస్తామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు. చట్టపరంగా న్యాయం చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్‌శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజావాణి ద్వారా ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. తద్వారా ప్రజల్లో పోలీస్‌శాఖపై నమ్మకం మరింత పెరిగిందన్నారు.


