
చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో క్రీడా ప్రాంగణం దుస్థితి
చిన్నశంకరంపేట(మెదక్): క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా మారాయి. చాలా వరకు గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేయగా, మరికొన్ని చోట్ల ఆటలకు అనువుగా లేని చోట క్రీడా పరికరాలు బిగించి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 81 మధిర గ్రామాలు ఉండగా మొత్తం 504 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. కనీసం అర ఎకరంలో మైదానం ఏర్పాటు చేసి వ్యాయాయం చేసేందుకు సింగిల్ బార్, డబుల్‌బార్, వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలి. కాని ఎక్కడా సరైన స్థలం లేకుండానే క్రీడా పరికరాలు బిగించారు. ఒక్కో క్రీడా ప్రాంగణం పేరుతో కొందరు అధికారులు లక్షల రూపాయలు జేబులు నింపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
● చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో క్రీడా ప్రాంగణం అరగుంటలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.
● ఒకవైపు వాటర్ ట్యాంక్, మరోవైపు పెద్ద బండరాళ్లు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటివరకు యువకులు ఆటలు ఆడింది లేదు.
● మండలంలోని కొర్విపల్లిలో పాఠశాల గోడకు ఆనుకొని క్రీడా పరికరాలు ఏర్పాటు చేశారు.
● గవ్వలపల్లిలో గ్రామానికి దూరంగా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో అక్కడ ఆటలు ఆడడం లేదు.
● ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులు ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు.
● మెదక్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సరైన చోట క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయలేదు.
● పట్టణంలో అయితే కనీసం సగం వార్డుల్లో కూడా ఏర్పాటు చేయలేదు. చేసినవి కూడా పాఠశాలల్లో మాత్రమే ఉన్నాయి.
● నార్సింగి, తూప్రాన్, రామాయంపేట, చేగుంట, పాపన్నపేట మండలాల్లో చాలా వరకు ఊరికి దూరంగా ఉన్నాయి.
● నూతనంగా ఏర్పడిన ప్రభుత్వమైన క్రీడలకు అనువైన స్థలాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి వినియోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
అలంకారప్రాయంగా క్రీడా ప్రాంగణాలు

కొర్విపల్లి క్రీడా ప్రాంగణంలో నిరుపయోగంగా పరికరాలు