సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలకు స్వస్తి ఉమ్మడి జిల్లాకు 957 మరుగుదొడ్లు మంజూరు ఒక్కో యూనిట్‌కు రూ.4.80లక్షలు
ఊరు మందమర్రి ప్రభుత్వ పాఠశాలల్లో 131 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 68 మంది బాలురు, 63 మంది బాలికలు, 11 మంది ఉపాధ్యాయ సిబ్బంది(9మంది మహిళలు)కి ఒకే మరుగుదొడ్డి, మూత్రశాల మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. తర్వాత కాలంలో రేకుల షెడ్డుతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇంటర్వెల్ సమయంలో బాలికలు వెళ్లి వచ్చే వరకు బాలురు వేచి ఉండాల్సి రావడం.. ఒకరు లోపలికి వెళ్లి మరొకరు బయట కాపలా కాయాల్సిన దుస్థితి ఉండేది. సమస్య తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం తాజాగా రెండు యూనిట్లు(8మూత్రశాలలు, 2కుండీలు(మరుగుదొడ్లు) మంజూరుతో ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా బాలికలకు తగనన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్నిసార్లు సమస్య కారణంగా బడికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్ల కొరత, పారిశుద్ధ్య సమస్య తీరనుంది. విద్యార్థుల ఆత్మగౌరవాన్ని, సౌకర్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం బాలిబాలికల మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక్కో యూనిట్‌కు రూ.4.80 లక్షలు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా 623 పాఠశాలల్లో 957 మరుగుదొడ్లకు రూ. 45.91 కోట్లు మంజూరయ్యాయి.
కష్టాలకు చెల్లు..
గతంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఒకే మరుగుదొడ్డి కేటాయించారు. కొన్ని చోట్ల వాటిని బాలికలకే కేటాయించడంతో బాలురు ఇబ్బందులు పడేవారు. హైస్కూల్ మాటేలా ఉన్నా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలు అంతా ఇంత కాదు. ఒకటికి, రెంటికి ఇళ్లకు వెళ్లిరావడం.. బహిరంగ ప్రదేశాలల్లో మలవిసర్జన చేసే దుస్థితి. ఈ సమయంలో విషపూరిత కీటకాల బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని పాఠశాలల్లోనూ ప్రత్యేకంగా బాలబాలికలకు మరుగుదొడ్లు మంజూరుతో కష్టాలకు చెక్ పడనుంది.
బాలికల కంటే బాలురకే ఎక్కువ
సర్కారు పాఠశాలల్లో మంజూరు చేసిన మరుగుదొడ్లలో బాలికల కంటే బాలురకే ఎక్కువ కేటా యించారు. గతంలో ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఒకటి రెండు మరుగుదొడ్లు కేటాయించగా అప్పట్లో బాలికలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుతం భిన్నంగా ఉంది.
మందమర్రి (వి) ఎంపీయూపీఎస్‌లో ప్రార్థనలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
పనులు వేగవంతం
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి గతంలో ఈ జీఎస్ కింద రూ.2లక్షలు కేటాయించేవారు. మూ త్రశాల, మరుగుదొడ్డి, పైపులైన్, సంపు, సింటె క్స్ ట్యాంకు, వాష్‌బేసిన్, నీటిసరఫరా పైపులైన్లు చేపట్టాల్సి రావడంతో ఆ నిధులు సరిపోక కాంట్రా క్టర్ మధ్యలోనే నిలిపి వేసేవారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి ఉన్న పాఠశాలలకు ఒక్కో యూనిట్‌కు రూ.4.80లక్షలు, సీనియర్ సెకండరీ పాఠశాలలకు రూ.4.75లక్షలు చొప్పున కేటాయించడం ద్వారా నాణ్యమైన నిర్మాణాలకు అవకాశం ఉంది. పనులను ఈ–ప్రొక్యూర్‌మెంటు విధానం ద్వారా టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఉమ్మడి జిల్లాకు మంజూరైన మరుగుదొడ్లు
జిల్లా పాఠశాలలు మొత్తం బాలురకు బాలికలకు
ఆదిలాబాద్ 178 324 171 153
ఆసిఫాబాద్ 182 27 182 89
మంచిర్యాల 98 128 97 31
నిర్మల్ 165 228 149 79
మొత్తం 623 957 605 352


