తాండూర్: చిరుతపులి దాడి చేసిన ఘటనలో రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన జరుపుల సుంగు నాయక్ ఆవు మృతి చెందినట్లు తాండూర్ అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ గౌరిశంకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గోలేటిలోని ఆవుల మందతో కలిసి సుంగునాయక్‌కు చెందిన ఆవు శనివారం గోలేటి, తాండూర్ శివారులోని అటవీ ప్రాంతానికి మేత కోసం వెళ్లింది. సాయంత్రం సుంగునాయక్ ఆవు ఇంటికి చేరుకోలేదు. రైతులు ఆదివారం సమీప అటవీ ప్రాంతాల్లో గాలించగా ఆవు కళేభరం లభ్యమైంది. వెంటనే సుంగునాయక్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న డిప్యూటీ రేంజర్ గౌరి శంకర్, బీట్ అధికారి రాజ్యలక్ష్మి పరిసరాలను పరిశీలించి చిరుతపులి పాదముద్రలు గుర్తించారు. చిరుతపులి దాడిలోనే ఆవు మృతి చెందినట్లుగా అఽధికారులు నిర్ధారించారు. బాధితుడికి నష్టపరిహారం కోసం సిఫారసు చేయనున్నట్లు అధికారి తెలిపారు.


