ప్రమాదాలకు చౌరస్తా | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలకు చౌరస్తా

Oct 4 2026 8:32 AM | Updated on Oct 4 2026 8:32 AM

నగరంలో అలంకారప్రాయంగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌

యూ టర్న్‌లు మూసివేత

ఇష్టారీతిన వెళ్తున్న వాహనదారులు

ప్రమాదాల నివారణలో అధికారుల నిర్లక్ష్యం

నస్పూర్‌: మంచిర్యాల నగరంలోని ఇందారం క్రాస్‌ రోడ్డు నుంచి మంచిర్యాల ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వరకు ఉన్న అనేక చౌరస్తాలు ప్రమాదాలకు నెలవుగా మారాయి. మరోవైపు ట్రాఫిక్‌సిగ్నల్స్‌ అలంకారప్రాయంగా మారాయి. నస్పూర్‌ గేటు వద్ద గత సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందడం నగరవాసులను కలిచి వేస్తూనే ఉంది. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నస్పూర్‌ గేటు, సీసీసీ నస్పూర్‌ పోలీసుస్టేషన్‌, అంబేడ్కర్‌ కాలనీ వద్ద యూటర్న్‌లను మూసివేశారు. దీంతో సీసీసీ కార్నర్‌, తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా, ఫ్లడ్‌ కాలనీ చౌరస్తా, కలెక్టరేట్‌ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ పెరిగింది. అందుకు అనుగుణంగా చౌరస్తాల వద్ద ట్రాఫిక్‌ పోలీసులు విధులు నిర్వర్తించడం లేదు. నస్పూర్‌లోని సీసీసీ కార్నర్‌, తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తాలోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ గత ఏడాదికి పైగా పని చేయడం లేదు. సిగ్నల్స్‌ అలంకారప్రాయంగా మారడంతో వాహనదారులు ఇష్టారీతిన వెళ్తున్నారు.

వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు

సీఐఎస్‌ఎఫ్‌, సీసీసీ టౌన్‌షిప్‌, కృష్ణాకాలనీ ప్రాంతాల్లోని వాహనదారులు సీసీసీ కార్నర్‌ మీదుగా మంచిర్యాల చెన్నూర్‌, గోదావరిఖని వైపు రాకపోకలు సాగిస్తుంటారు. శ్రీరాంపూర్‌ ఏరియాలోనే అతిపెద్దదైన కార్మిక కాలనీ షిర్కే కాలనీలో 3500 క్వార్టర్లు ఉన్నాయి. వీటికితోడు తాళ్లపల్లి, సింగాపూర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు ఏర్పాటయ్యాయి. ఈ కాలనీల్లోని ప్రజలు, సింగరేణి కార్మికులు తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా మీదుగా జాతీయ రహదారి–363 నుంచి మంచిర్యాల, చెన్నూర్‌, గోదావరిఖని ఏరియాలకు వందల సంఖ్యల వాహనాలపై వెళ్తుంటారు. సీసీసీ కార్నర్‌, తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పని చేయకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. సింగరేణి కార్మికులు విధులకు, విద్యార్థులు పాఠశాలల, కళాశాలలకు సమయానికి చేరుకోలేకపోతున్నారు.

శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం చౌరస్తా, బస్టాండ్‌, కలెక్టరేట్‌ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయలేదు. ఆయా ఏరియాల్లో తరచూ ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడడం, గాయపడడం పరిపాటిగా మారింది. బస్టాండ్‌ నుంచి నిత్యం వివిధ ఏరియాలకు ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల రాకపోకలతో బస్టాండ్‌ ఏరియా నిత్యం రద్దీగా ఉంటుంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో వాహదారులు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల కార్పొరేషన్‌గా ఏర్పడినా ట్రాఫి క్‌ పోలీసులు నస్పూర్‌, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో ఎక్కడా విధులు నిర్వర్తించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement