మంచిర్యాలఅర్బన్: ఉపాధ్యాయులు బోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి.చంద్రయ్య సూచించారు. ఏఎక్స్‌ఎల్ కార్యక్రమంలో భాగంగా శనివారం మంచిర్యాలలోని కార్మెల్ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని 72 ప్రభుత్వ పాఠశాలల భాషా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమంలో అభ్యసన ఫలితాలు సాధించని విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎఫ్‌ఎల్‌ఎన్, ఏఎక్స్‌ఎల్, ఏఐ కార్యక్రమాన్ని గతేడాది ప్రారంభించిందన్నారు. బోధనలో ఏఐ సాంకేతికతను జోడించడం వల్ల విద్యార్థులు పాఠశాలల్లోని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల ద్వారా ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా నేర్చుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి భరత్, రిసోర్స్ పర్సన్ వామను, ముసిర్, రాజేశ్, పాఠశాల ప్రిన్సిపాళ్లు, రిన్నేట్, కృప పాల్గొన్నారు.
రేపటి నుంచి సదరం వైద్య శిబిరాలు
పాతమంచిర్యాల: ఈ నెల 5 నుంచి 28వరకు మంచిర్యాలలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దివ్యాంగుల వైకల్య నిర్ధారణ(సదరం) శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్.కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు మీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు హాజరు కావాలని పేర్కొన్నారు. వినికిడి, మాట్లాడడంలో లోపం ఉన్నవారు 5, 8న, మానసిక అనారోగ్యం, మేధోవైకల్యం ఉన్నవారు 6, 7న, లోకోమోటారు, ఆర్థో బాధితులు 9, 12, 13, 14, 15, 24న, హిమోఫిలియా, సికిల్‌సెల్, కొడవలి కణం 27న, తక్కువ దృష్టిలోపం, తలసేమియా బాధితులు 28న శిబిరాలకు హాజరు కావాలని, వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్ చేసుకున్న వారి ఫోన్లకు సమాచారం అందించామని, ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు.


