పెట్రేగుతున్న వీధికుక్కలు..! | - | Sakshi
Sakshi News home page

పెట్రేగుతున్న వీధికుక్కలు..!

Aug 4 2026 12:53 AM | Updated on Aug 4 2026 12:53 AM

వీధుల్లో గుంపులుగా సంచారం

మంచిర్యాల నగరంలోనే అధిక సంతతి

చిన్నారులే లక్ష్యంగా దాడులు చేసి గాయపరుస్తున్న వైనం

జేజీహెచ్‌లో 15 రోజుల్లో 160 కుక్కకాటు కేసులు

శస్త్ర చికిత్సలు చేయిస్తున్నాం

మంచిర్యాల నగరంలో వీధికుక్కలను పట్టుకుని వాటికి సంతతి కలుగకుండా శస్త్ర చికిత్సలు చేయిస్తున్నాం. ఇటీవల చేపట్టిన ఈ ప్రక్రియలో 194 వీధికుక్కలకు శస్త్ర చికిత్సలు చేసి, ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడే వదిలేస్తున్నారు. వీధికుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం లేదు. పారిశుద్ధ్యం మెరుగుపర్చి, జంతు కళేబరాలు పడేయకుండా చర్యలు తీసుకుంటాం.

– అన్వేష్‌, మంచిర్యాల నగర పాలకసంస్థ కమిషనర్‌

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట వీధి కుక్కల దాడిలో చిన్నారులు గాయపడిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతేడాది కాసిపేట మోడల్‌ స్కూల్‌లో వీధి కుక్కలు చిన్నారిపై చేసిన దాడిని జిల్లా ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ ఏడాది జూన్‌ 3న పోచమ్మ గుడి సమీపంలో నాలుగేళ్ల చిన్నారి యశ్వంత్‌పై ఒకేసారి నాలుగు వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆగస్టు 3న హైటెక్‌సిటీ కాలనీలోని ఓపెన్‌ జిమ్‌ పార్కు వద్ద తొమ్మిదేళ్ల చిన్నారి మారం సుదీక్షపై ఒకేసారి మూడు వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారులనే లక్ష్యంగా చేసుకుని స్వైర విహారం చేస్తున్నా వాటిని నియంత్రించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జూలై వరకు 433 మంది కుక్కకాటుకు గురైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోనే కేవలం 15 రోజుల్లో 160 కుక్కకాటు కేసులు నమోదు కావడం గమనార్హం. రోజుకు దాదాపు ఐదుగురు కుక్కకాటుకు గురై చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు.

శస్త్ర చికిత్సలు చేస్తున్నా..

మంచిర్యాల నగరంలో కుక్కలకు శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆండాళమ్మ కాలనీలో అనిమల్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వీధి కుక్కలను అక్కడికి తరలించి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తున్నారు. ఇటీవల మంచిర్యాల నగరంలోని 194 వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు చేసి, తిరిగి వాటిని తీసుకువచ్చి కాలనీల్లోనే వదిలేశారు. దీంతో గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ, చిన్నారులు, వృద్ధులపై దాడులకు దిగుతున్నాయి. నగరంలోని హైటెక్‌సిటీ కాలనీలో వీధి కుక్కల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, తరచూ ఈ ప్రాంతంలోనే కుక్కల దాడిలో గాయపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

మంచిర్యాల నగరంలోనే..

మంచిర్యాల నగరంలో పారిశుద్ధ్యం సక్రమంగా చేపట్టక పోవడంతో ఈ ప్రాంతంలోనే వీధికుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఏ వీధిలో చూసినా 20కి పైగా కుక్కలు సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో చెత్తా చెదారం వేయడం, మాంసం దుకాణాదారులు వేస్టేజీలను, మృతి చెందిన జంతు కళేబరాలను వేస్తుండడంతో వీధికుక్కల సంఖ్య పెరుగుతోంది. మంచిర్యాల నడిబొడ్డున ఉన్న హైటెక్‌సిటీ కాలనీ, శ్రీనివాస కాలనీ, లక్ష్మీనగర్‌, వికాస్‌నగర్‌, మారుతి నగర్‌, ఎంసీసీ కాలనీ, తిలక్‌నగర్‌, హమాలివాడ, చున్నంబట్టి వాడ, శ్రీశ్రీనగర్‌, మజీద్‌వాడ, ఎడ్లవాడ, పాతమంచిర్యాలలో వీధికుక్కల బెడద తీవ్రంగా ఉంది. వీధి కుక్కలు రోడ్లపై నడుస్తూ వెళ్లే వారి వెంట పడుతుండడంతో, గుంపులుగా కలిసి రావాల్సిన పరిస్థితి నెలకొంది.

జిల్లాలో కుక్కకాటుకు

గురైన వారి వివరాలు

సంవత్సరం బాధితులు

2019 3,048

2020 2,400

2021 2,168

2022 1,685

2023 2,277

2024 657

2025 1,165

2026(జూలై) 433

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement