వన్యప్రాణులకు సహజసిద్ధమైన గడ్డి | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులకు సహజసిద్ధమైన గడ్డి

Jul 27 2026 11:49 PM | Updated on Jul 27 2026 11:49 PM

● విత్తనాలు చల్లి పెంచే యోచనకు స్వస్తి ● కలుపుతీసి సిద్ధం చేయనున్న అధికారులు

జన్నారం: కవ్వాల్‌ అడవుల్లో జీవ వైవిధ్యం, శాఖాహార జంతువుల మనుగడకు అత్యంత కీలకమైన సహజసిద్ధమైన గడ్డి భూముల రక్షణకు అటవీ శాఖ ప్రాధాన్యతనిస్తోంది. 2018 నుంచి జన్నారం అడవుల్లో గడ్డి క్షేత్రాలను అభివృద్ధి చేస్తోంది. గడ్డి క్షేత్రాల నిపుణుడు మురద్కర్‌ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇన్ని సంవత్సరాలు విత్తనాల ద్వారా గడ్డిని పెంచిన అధికారులు ఈసారి సహాజ సిద్ధమైన గడ్డిని అందించేందుకు చర్యలు చేపట్టారు. అటవీ ఆవాసాల్లో లభ్యమయ్యే పచ్చిక బయళ్లు తరించిపోకుండా, వాటిని ఆక్రమిస్తున్న కలుపు మొక్కలు తొలగించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వన్యప్రాణులు ఇష్టపడే సహజసిద్ధంగా మొలచిన గడ్డిని పెంపొందించి పిచ్చిమొక్కల తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

డివిజన్‌లో 599 హెక్టర్లు

జన్నారం అటవీ డివిజన్‌లోని 40 అటవీ బీట్‌లలో 599 హెక్టార్లలో గడ్డి క్షేత్రాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా ప్రతీ సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి గడ్డి విత్తనాలు తీసుకొచ్చి అడవుల్లో చల్లడం, గరక వంటి గడ్డిని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి కుంటల కట్టలు, వన్యప్రాణులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో నాటేవారు. కానీ ఈ సంవత్సరం సహజంగా పెరిగే గడ్డిని వన్యప్రాణులకు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. డివిజన్‌లోని 599 హెక్టర్లలో వ్యాపించిన గడ్డి క్షేత్రాల ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు తొలగించి నాణ్యమైన గడ్డిని అందించేందుకు పనులు ప్రారంభించారు. ఈ ఏడాది మరో 72 హెక్టార్లలో గడ్డి మైదానాలు పెంచనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గడ్డి క్షేత్రాల వైపు పశువులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బేస్‌క్యాంపు వాచర్లు, బీట్‌ అధికారులు వీటి సంరక్షణకు జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో అటవీ ప్రాంతాల్లో లాంటానా, పార్థీనియం, లాంటానా ఫిల్టర్‌ వంటి కలుపు మొక్కలు తీవ్రంగా విస్తరిస్తున్నాయి. ఇవి సహజ సిద్ధమైన గడ్డి పెరగకుండా అడ్డుకోవడమే కాకుండా, భూమిలోని తేమ, పోషకాలను వేగంగా పీల్చుకునే అవకాశం ఉన్నందున అటవీశాఖ అధికారులు కలుపు మొక్కలను ఏరివేసే పనిలో ఉన్నారు.

జీవ వైవిధ్యానికి ఊపిరి

సహజ పచ్చిక బయళ్లు అభివృద్ధి చెందడం వల్ల శాఖాహార జంతువులకు సమృద్ధిగా ఆహారం లభిస్తుంది. శాఖాహార జంతువుల సంఖ్య పెరిగితే, మాంసాహార జంతువులైన పులులు, చిరుతపులులకు కూడా ఆహార చక్రంలో సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మానవ–వన్యప్రాణి సంఘర్షణలు తగ్గుముఖం పడతాయని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

అభివృద్ధికి తోడ్పాటు

అడవిలో సహజమైన పర్యావరణ వ్యవస్థ నిలబడాలంటే గడ్డి భూములు ఎంతో అవసరం. పిచ్చిమొక్కలను తొలగించి, వన్యప్రాణులకు నిరంతరం ఆహారం దొరికేలా చేయడమే అటవీ శాఖ ప్రధాన లక్ష్యం. గడ్డి మైదానాలు శాఖాహార జంతువుల అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది. శాఖాహార జంతువులు అభివృద్ధి చెందితే పులులు ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.

– లక్ష్మీనారాయణ, ఎఫ్‌ఆర్వో, ఇందన్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement