విస్తరించిన జిల్లా కేంద్రం
మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మంచిర్యాల
ప్రతిపాదనలకే పరిమితమైన టూటౌన్ పోలీస్‌స్టేషన్
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రమైన మంచిర్యాల నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. మున్సిపాల్టీ నుంచి నగర కార్పొరేషన్‌గా మారింది. సుమారు లక్షా యాభై వేల జనాభా నివాసం ఉంటోంది. నేరాలు, కేసుల సంఖ్య పెరుగుతోంది. టూటౌన్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాల కాలంగా ప్రతిపాదిస్తున్నా మోక్షం కలుగడం లేదు. మంచిర్యాల సబ్ డివిజన్‌లోని సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్, హాజీపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఏడు గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. కానీ పోలీసుస్టేషన్ల పరిధి మాత్రం ఎక్కడికక్కడే పాత పద్ధతిలోనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఒకే పోలీస్‌స్టేషన్ ఉంది. నగరంలోని 60 డివిజన్లు మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో విస్తరించి ఉన్నా యి. హాజీపూర్ ఠాణాలో 8, మంచిర్యాల ఠాణాలో 28, నాలుగు గ్రామ పంచాయతీలు, సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో 18, శ్రీరాంపూర్ స్టేషన్ పరిధిలో 6 డివిజన్లు ఉన్నాయి. హాజీపూర్, సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్ ఠాణాల్లో ఏడాదికి సగటున 200 నుంచి 400 వరకు కేసులు నమెదవుతున్నాయి. ఒక్క మంచిర్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలో సగటున 1000 కేసులు నమోదవుతున్నాయి.
ప్రతిపాదనలకే పరిమితం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలా బాద్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండేసి పోలీస్‌ేస్టేషన్లు ఉన్నాయి. మంచిర్యాలతో పోల్చి చూస్తే నిర్మల్, బెల్లంపల్లి, ఆదిలాబాద్‌లో నేరాల శాతం తక్కువే ఉంటుంది. అయినా మంచిర్యాలలో ఒకే ఠాణా ఉండడం, సిబ్బంది కొరతతో నెట్టుకొస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరిహద్దు కావడంతోపాటు రైలుమార్గం ఉన్నందున నేరాలు అధికంగా జరిగేందుకు ఆస్కారం ఉంది. దీంతో నేరాల శాతం పెరుగుతోంది. మంచిర్యాలలో మరో పోలీసుస్టేషన్(టూటౌన్) అనివార్యమని దశాబ్దాల కాలంగా ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. టౌటౌన్ ఏర్పాటుతోపాటు సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో పోస్టును సీఐ స్థాయి అధికారికి అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టేషన్ పరిధిలో కలెక్టరేట్, జిల్లా కోర్టు భవనం, సింగరేణి ప్రాంతం ఉన్నాయి. కలెక్టరేట్ ఎదుట ధర్నాలు, వీఐపీల తాకిడి, బందోబస్తు విధులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.


