ఆర్టీసీలో ఇష్టారాజ్యంగా విధుల కేటాయింపు సీనియర్లకు కాదని జూనియర్లకు అందలం వివాదాస్పదమవుతున్న అధికారుల తీరు
ఆదిలాబాద్:సిబ్బంది కొరతతో ఆర్టీసీ సతమతమవుతోంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం 8 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్కోసారి 12 గంటల వరకు పనిచేయాల్సిన దుస్థితి. సిబ్బందిలేమి కారణంగా పనిభారం అధికమై ఎంతోమంది ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారికే డబుల్ డ్యూటీ (డీడీ)లు కేటాయిస్తూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది అధికారులు అవుట్ ఆఫ్ డిసిగ్నేషన్ డ్యూటీస్ (ఓడీ)లు ఇస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఓడీఎం బదిలీపై వెళ్తూ కొంతమంది ఉద్యోగులకు ఓడీలు ఇచ్చి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా రీజియన్ వ్యాప్తంగా కొంతమంది ఉన్నతాధికారులు అడ్డగోలుగా ఓడీలు ఇస్తూ అక్రమంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.
అయినవారికి అందలం..
సాధారణంగా స్టాఫ్ తక్కువగా ఉంటే నియామకాల ద్వారా ఖా ళీలు భర్తీ చేస్తారు. లేదంటే స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగులకు ఓడీ పేరుతో విధులు కేటాయిస్తారు. ఆర్టీసీలో నియామకాలు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే అధికారులు ఓడీలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడే కొంతమంది ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తమకు వత్తాసు పలికే వారికి అప్పనంగా ఓడీలు కేటాయిస్తున్నారు. ఓవైపు సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఉంటుండగా, తమకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులను అందలమెక్కిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల డిపోలో సీనియార్టీని కాదని, కొంతమంది జూనియర్ ఉద్యోగులకు అవుట్ ఆఫ్ డిసిగ్నేషన్ డ్యూటీలు ఇవ్వడం వివాదాస్పదమైంది. అనారోగ్య కారణాలు, వయస్సు రీత్యా సీనియర్లు విజ్ఞప్తి చేసుకుంటే అవసరాన్నిబట్టి ఓడీలు ఇవ్వాల్సింది పోయి, జూనియర్ ఉద్యోగులకు కేటాయించడం విమర్శలకు కారణమవుతోంది.
ఓడీలతో పెరుగుతున్న డీడీలు..
అవసరం ఉన్నా, లేకపోయినా కొంతమందికి ఓడీలు కేటాయిస్తుండడంతో మిగిలిన కార్మికులపై భారం పడుతోంది. క్షేత్రస్థాయిలో బస్సులు నడిచేందుకు కీలకంగా వ్యవహరించే డ్రైవర్లు, కండక్టర్లపై డబుల్ డ్యూటీల భారం పడుతుంది. సిబ్బంది లేకపోవడంతో వారికి డబుల్ డ్యూటీ పేరిట అదనంగా పే చేయాల్సి వస్తుంది. తమవారికి లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్న అధికారులు, పరోక్షంగా ఇతర ఉద్యోగులపై పనిభారం నెడుతున్నారు. దీంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగులు ఆసుపత్రుల పాలవుతున్నారు.
రీజియన్ పరిధిలోని ఉద్యోగులు
డిపో డ్రైవర్లు కండక్టర్లు
ఆదిలాబాద్ 129 204
ఆసిఫాబాద్ 90 111
భైంసా 33 128
మంచిర్యాల 149 162
నిర్మల్ 138 204
ఉట్నూర్ 39 46
మొత్తం 578 855
వేధిస్తున్న సిబ్బంది కొరత..
ఆదిలాబాద్ రీజీయన్ వ్యాప్తంగా 737 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరిలో రెగ్యులర్ డ్రైవర్లు 583 మంది ఉన్నారు. మిగతా 154 మంది అవుట్ సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 867 మంది కండక్టర్లు ఉండగా, వీరిలో కూడా సిబ్బంది కొరత ఉంది. మరోవైపు కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారులు ఇష్టారాజ్యంగా ఓడీలు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది.


