‘కడెం’కు రక్షణగా ట్రాష్‌రాక్‌ | - | Sakshi
Sakshi News home page

‘కడెం’కు రక్షణగా ట్రాష్‌రాక్‌

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

● ప్రధాన కాలువలో చెత్తాచెదారానికి అడ్డుకట్ట ● 2.58 కోట్లతో నిర్మాణం ● ఈ నెల చివరి వరకు పనులు పూర్తి

కడెం: నిర్మల్‌–మంచిర్యాల జిల్లాల ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్‌ కడెం ద్వారా 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. కడెం ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువ ద్వారా కడెం, దస్తురాబాద్‌, జన్నారం, దండెపల్లి, హాజీపూర్‌, లక్సెట్టిపేట మండలాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రధాన కాలువకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపట్టింది. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సమస్యకు చెక్‌

కడెం ప్రాజెక్ట్‌ వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, చెత్తాచెదారం ప్రధాన(ఎడమ) కాలువ గేట్లలో ఇరుక్కుని, కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఇబ్బందులు తలెత్తేవి. గతేడాది కాలువ గేటులో భారీ దుంగ ఇరుక్కుపోవడంతో గేటును కిందకు దించలేకపోయారు. ఇలాంటి సమయంలో సాగునీరు వృథాగా పోయో పరిస్థితి నెలకొంటుంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు రక్షణగా రూ.2.58 కోట్ల వ్యయంతో ట్రాష్‌రాక్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. కాలువ సమీపంలో ఈ ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపట్టడంతో వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, కట్టెలు, చెత్తాచెదారం అడ్డుకుంటుంది. దీంతో ప్రధాన కాలువకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగునీటిని దిగువకు వదిలేందుకు ఆస్కారం ఉంటుంది. కాలువకు అడ్డుకట్టగా భారీ పిల్లర్లను నిర్మించి, మధ్యలో భారీ ఇనుప జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కాలువకు ప్రస్తుతం ఉన్న గేట్లను తొలగించి వాటిస్థానంలోనూతన గేట్లను అమర్చనున్నారు.

ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఫోకస్‌

కడెం ప్రాజెక్ట్‌ మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022, 2023లో కడెం ప్రాజెక్ట్‌కు వచ్చిన భారీ వరదల కారణంగా ప్రాజెక్ట్‌ డేంజర్‌జోన్‌లోకి వెళ్లింది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.12 కోట్ల నిధులతో ప్రాజెక్ట్‌ వరద గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం రూ.2.58 కోట్లతో ప్రాజెక్టు ఎడమ కాలువకు రక్షణగా ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపడుతున్నారు.

ఈ నెలాఖరుకు పూర్తి

కడెం ప్రధాన కాలువలోకి భారీ దుంగలు వెళ్లి కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపడుతున్నాం. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల చివరినాటికి పనులు పూర్తి చేయిస్తాం.

– వీరన్న, డీఈఈ, కడెం ప్రాజెక్ట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement