కడెం: సాగు భూముల కోసం మండలంలోని పెత్తర్పు గోండుగూడ వాసులకు అటవీ అధికారులకు మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. మంగళవారం పునరావాసంలో భాగంగా కవ్వాల్ టైగర్‌జోన్‌లో రాంపూర్, మైసంపేట్ వాసులకు అప్పగించిన సాగు భూములకు హద్దులు ఏర్పాటు చేయించేందుకు వెళ్లిన అటవీ, రెవెన్యూ అధికారులను గోండుగూడ వాసులు మళ్లీ అడ్డుకున్నారు. పునరావాస గిరిజనులతో పాటుగా ఏళ్లుగా ఇక్కడే సాగు చేస్తున్న తమకు సాగు భూములు కేటాయించాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పది మంది ఆదివాసీలను జీపులో ఇందన్‌పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. అడ్డుకునేందుకు వెళ్లిన మహిళలను ఈడ్చుకెళ్లారు. ఓ ఆదివాసీ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పునరావాసంలో భాగంగా రాంపూర్, మైసంపేట్ వాసులకు భూములు అప్పగించామని, వారికి పట్టాలు సైతం వచ్చాయని, గోండుగూడ వాసులు అడ్డుకోవడం సరికాదని ఎఫ్‌డీవో శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవదాసు, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎఫ్‌ఆర్వోలు గీతారాణి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, అనితా, కల్పనదేవి, వాణి, రామకృష్ణ, కిరణ్, ఎస్సైలు సాయికిరణ్, సాయికుమార్, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.
అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదు
కడెం: మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ జీపీ పరిధిలోని గోండుగూడ వాసులపై అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదని రాంజీగోండ్ సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గోండుగూడ ఆదివాసీలు సాగు భూముల కోసం పోరాడితే వారిని అడ్డుకుని ఇందన్‌పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారన్నారు. ఆదివాసీలకు సాగు భూములు దక్కే వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్, తొడసం భీంరావు, తదితరులు పాల్గొన్నారు.


