మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల కష్టాలు తీరనున్నాయి. డివిజన్‌కో కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబా టులోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రణాళిక రూపొందించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడ్డాక విలీనమైన న స్పూరు మున్సిపాలిటీ, హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను కలుపుకొని మొత్తం 60 డివి జన్లుగా మారింది. పరిధి పెరగడం, డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రజలు నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకోలేని పరి స్థితి నెలకొంది. దీంతో ప్రజలకు పాలన సౌలభ్యంగా ఉండాలని ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంతో ప్రతీ డివిజన్‌కు ఒక కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇప్పటికే విలీన గ్రామాల్లో ఉన్న గ్రామపంచాయతీ కార్యాలయాలు, నస్పూరు మున్సిపాలిటీ పరిధిలో సింగరేణి క్వార్టర్లు, భవనాలను డివిజన్ కార్యాలయాలుగా వినియోగించుకుంటుండగా, కొత్తగా 45 కొత్త కార్యాలయాలు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.1.40 కోట్లు కేటాయిస్తూ రెండు నెలల క్రితం పాలకవర్గం తీర్మానం చేసి ఆమోదించింది. ఇటీవలే టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మంచిర్యాల ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, కలెక్టర్ కుమార్ దీపక్, కమిషనర్ అన్వేశ్ ఈ నెల 13న శంకుస్థాపన చేశారు. ఆగస్టు 30లోపు డివిజన్ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించగా, పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా..
ఎమ్మెల్యే ఆదేశాలతో డివిజన్ కార్యాలయాలు నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్డు ఆఫీసర్లుగా 54మంది పనిచేస్తుండగా మరో ఆరుగురు అవసరముంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు డివిజన్లకు పక్కనే ఉన్న డివిజన్ ఆఫీసర్ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. డివిజన్‌లో కార్యాలయాలు లేకపోవడంతో వార్డు ఆఫీసర్లు కూడా ఎప్పుడు కాలనీకి వస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతోనే ప్రజలు వారి సమస్యలు చెప్పుకొనేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వస్తున్నారు. దీంతో కార్యాలయం నిత్యం రద్దీగా మారుతుండడం, ప్రజలకు దూరభారంతో పాటు సమయం వృథా అవుతుండడం ఇబ్బందిగా మారుతోంది. డివిజన్ కార్యాలయాలు అందుబాటులోకి వస్తే ఇక ప్రజలు ఏ సమస్య ఉన్నా కార్యాలయంలో ఉండే వార్డు ఆఫీసర్ లేదా కార్పొరేటర్‌కు నేరుగా వివరించే అవకాశముంటుంది. ప్రజల సమస్యలపై వచ్చిన వినతులను వెంటనే మంచిర్యాల నగర పాలక సంస్థ కార్యాలయానికి పంపించి రెండుమూడ్రోజుల్లోపే పరిష్కరించేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు కాలనీల్లో ఎక్కువగా ఉండగా వాటి పరిష్కారం కోసం అధికారులు చర్యలు వెంటనే తీసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది.


