ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

లక్సెట్టిపేట: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్‌ తెలిపిన వివరాల మేరకు కొత్తూరు గ్రామానికి చెందిన సునారికారి మహేష్‌ (41) మున్సిపల్‌ పరిధిలోని ఆంధ్రకాలనీ సమీపంలో బిర్యాని పాయింట్‌ నడుపుతున్నాడు. కొంతకాలంగా ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడి రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. మంగళవారం లోన్‌కు సంబంధించిన వ్యక్తి వచ్చి డబ్బులు చెల్లించాలని నిలదీయడంతో రేపు ఇస్తానని చెప్పి అతన్ని పంపించాడు. విషయం కుటుంబ సభ్యులతో చెప్పి బాధపడ్డాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు హోటల్‌కి వెళ్లి చూసేసరికి ఉరేసుకుని కనిపించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

భూమిని స్వాధీనం చేసుకున్న రైల్వే అధికారులు

తాండూర్‌: మండలంలోని రేచిని రోడ్‌ రైల్వేస్టేషన్‌, బో యపల్లి బోర్డు ప్రాంతంలో బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెల్లవారుజాము నుంచే జేసీబీలు, రైల్వే అధికారులు, పెద్దయెత్తున రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, సివిల్‌ పోలీసులు, రైల్వే సిబ్బంది వంద మందికి పైగా చేరుకున్నారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక స్థానికులు అయోమయానికి గురయ్యారు. రేచిని రోడ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వేశాఖ, ఓ ప్రైవేటు సంస్థ మధ్య వివాదాస్పదంగా ఉన్న భూమిని రైల్వే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేసీబీలతో చుట్టూ ఉన్న ప్రహరీ, కట్టడాలు తొలగించారు. జాతీయ రహదారిని ఆనుకుని నిర్మాణంలో ఉన్న మరో కట్టడాన్ని కూల్చివేశారు. భూమిని రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయమై బెల్లంపల్లి ఇంజనీరింగ్‌ విభాగం అధికారిని ఫోన్‌లో సంప్రదించగా.. కోర్టు స్టే ఆర్డర్‌ తొలగించడమే కాక స్వాధీనానికి ఆదేశాలు ఇచ్చిందని, ఆ మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. తాండూర్‌ సీఐ దేవయ్య, తాండూర్‌, తాళ్లగురిజాల ఎస్సైలు ప్రసాద్‌రావు, రామకృష్ణ, బెల్లంపల్లి రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఏకపక్షంగా కూల్చివేతలు సరికాదు

తాండూర్‌: తాండూర్‌ శివారులోని స్టీపీల్‌ ఇన్‌ఫ్రాకేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ భూమి హద్దులు, కట్టడాలను రైల్వే అధికారులు ఏకపక్షంగా తొలగించడం సరికాదని ఆ సంస్థ అడ్వకేట్‌ ఉదయ్‌కిరణ్‌ అన్నారు. తాండూర్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2021లో సంస్థ కొనుగోలు చేసిన భూమికి అన్ని రెవెన్యూ రికార్డులు ఉన్నాయని తెలిపారు. కోర్టులో వివాదంపై కేసు నడుస్తోందని, రైల్వే అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ ఘటనపై తాండూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజర్‌ కిషోర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement