ఆర్టీసీలో విధులు.. ప్రైవేట్‌లో పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో విధులు.. ప్రైవేట్‌లో పరీక్షలు

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

● డ్రైవర్లకు మెడికల్‌ రెన్యూవల్‌ ప్రక్రియపై వివాదం

మంచిర్యాలఅర్బన్‌: ప్రయాణికుల భద్రత దృష్యా బస్‌ డ్రైవర్లకు మెడికల్‌ రెన్యూవల్‌ తప్పనిసరి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్‌ డ్రైవర్లు నిర్దిష్ట వ్యవధిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా 40 ఏళ్లకు పైబడిన డ్రైవర్లకు ఏడాదికి ఒకసారి, 40 లోపు ఉన్నవారికి మూడేళ్ల మెడికల్‌ రెన్యూవల్‌ చేయించుకోవాలి. సదరు డ్రైవర్లు ప్రభుత్వ ఆస్పత్రి లేదా ఆర్టీసీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ అద్దెబస్సు డ్రైవర్లు ప్రైవేట్‌ ల్యాబ్‌లో టెస్టులు చేయించుకోవాలని ఓ అధికారి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. నిబంధనలు పక్కనపెట్టి ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌తో ఒప్పందం చేసుకుని కొంతమంది డ్రైవర్‌లను పంపించడం చర్చనీయాంశంగా మారింది.

మెడికల్‌ రెన్యూవల్‌ ఇలా..

మెడికల్‌ రెన్యూవల్‌ అనేది ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి నిర్ధారించటానికి నిర్థిష్ట కాలానికి చేసే వైద్యపరీక్ష. డ్రైవర్లు, కండక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు కంటి, గుండె, బీపీ, షుగర్‌, సాధారణ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. వైద్యుని నిర్ధారణ తర్వాత ఫిట్‌గా ఉంటేనే మెడికల్‌ రెన్యూవల్‌ అవుతుంది.

జరుగుతున్నది ఏమిటి?

మంచిర్యాల ఆర్టీసీ ఆస్పత్రిలో ఉన్న ల్యాబ్‌ పరికరాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో నెలరోజులు ల్యాబ్‌లో టెస్ట్‌కు సంబంధించిన పరికరాలు సరఫరా కాలేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాల్సి ఉండగా ప్రైవేట్‌ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షలు లెటర్‌ప్యాడ్‌పై తీసుకువచ్చినా అభ్యంతరం చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న కొందరు అద్దె బస్సుల డ్రైవర్‌లు మాత్రం ఆస్పత్రి వర్గాల వైపు వేలెత్తి చూపుతున్నారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్షలకు రూ.1400 ఉంటే రూ.1200కు మేం చేయిస్తామని ‘మాములు’గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ తతంగంపై లిఖితపూర్వకంగా విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement