ఆర్థిక సంఘం నిధులతో ఊరట | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంఘం నిధులతో ఊరట

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

● జిల్లాకు రూ.5.40 కోట్లు మంజూరు ● మౌలిక వసతుల కల్పనకు ఖర్చు

మంచిర్యాలటౌన్‌: మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. అందులో భాగంగానే మున్సిపల్‌ పరిపాలన కమిషనర్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ టి.కె.శ్రీదేవి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది మే, జూన్‌ నెలలకు గానూ జిల్లాకు రూ.5,40,81,451 నిధులు విడుదల చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా నిధుల విడుదలతో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది. ఆస్తిపన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే జరగడం, మున్సిపాలిటీలకు వచ్చే నిధులు సరిపోక పోవడం, పాలకవర్గాలు లేవనే సాకుతో ఏడాదికాలంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల విడుదలలో జరిగిన జాప్యంతో మౌలిక వసతుల కల్పనకు జిల్లాలోని మున్సిపాలిటీలకు ఆర్థికంగా ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాలక వర్గాల ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది.

చేపట్టనున్న పనులు ఇవే..

రాష్ట్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను కేవలం కొన్ని నిర్దేశించిన పనులకు మాత్రమే ఉపయోగించాలని కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలతో పాటు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌, ఇతరత్రా చట్టబద్ధత కలిగిన చెల్లింపులను చేపట్టడంతో పాటు, భవిష్యత్‌ అవసరాలకు కనీసం ఆరు నెలల జీతాలకు సరిపడా నిధులను రిజర్వ్‌ చేసి ఉంచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, నీటిశుద్ధి, ప్రజా టాయిలెట్లు, ప్రజా ఉపయోగకరమైన ఆస్తుల నిర్వహణ చేపట్టాలని, డంపింగ్‌యార్డుల చుట్టూ కంపౌండ్‌ వాల్స్‌, షెడ్లు, సీసీ ప్లాట్‌ఫాంలు, విద్యుత్‌, నీటి సరఫరా, వాచ్‌మెన్‌ గదుల నిర్మాణం చేపట్టేందుకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు తడి, పొడి వ్యర్థాల ప్రాసెసింగ్‌ చేపట్టేందుకు అవసరమైన పరికరాల కొనుగోలు, బయోమైనింగ్‌ కోసం నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.

జిల్లాలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలకు విడుదలైన ఎస్‌ఎఫ్‌సీ నిధులు

నగరం/మున్సిపాలిటీ నిధులు(రూ.ల్లో)

మంచిర్యాల నగరం రూ.2.44 కోట్లు

బెల్లంపల్లి 81.28 లక్షలు

మందమర్రి 81.79 లక్షలు

చెన్నూర్‌ 38.36 లక్షలు

క్యాతన్‌పల్లి 57.30 లక్షలు

లక్సెట్టిపేట్‌ 37.71 లక్షలు

అవసరం మేరకు ఖర్చు

రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధులతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖర్చు చేయడం జరుగుతుంది. మంచిర్యాల నగర పాలక సంస్థ నూతనంగా ఏర్పడడంతో, వచ్చిన నిధులను ఉన్నతాధికారుల సూచనల మేరకు ఖర్చు చేస్తాం.

– అన్వేష్‌, మంచిర్యాల మున్సిపల్‌

కార్పొరేషన్‌ కమిషనర్‌

Advertisement
 
Advertisement
Advertisement