నేటి నుంచి వార్డు సభలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వార్డు సభలు

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

● వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి ● సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు

మంచిర్యాలటౌన్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4నుంచి 10వరకు ప్రభుత్వం వార్డు సభలు నిర్వహించనుంది. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమం రూపొందించింది. ప్రతీ వార్డులో అధికారులు సభలకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తే ప్రజా సమస్యలు పరిష్కారమై వర్షాకాలంలో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంది. గురువారం ప్రతీ గ్రామం, వార్డులో సభలు ఏర్పాటు చేసి పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్‌, విపత్తు నిర్వహణ అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. 5న పర్యావరణంపై అవగాహన, 6, 8న గ్రామ/వార్డు సభల నిర్వహణ, 9న క్రీడలపై చేపట్టాల్సిన చర్యలు, పలు క్రీడల్లో రాణిస్తున్న వారికి ప్రోత్సాహం అందించడం, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10న వార్డు సభల అనంతరం, 12న విద్యాసంస్థల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలుకుతూ మాదకద్రవ్యాలను వినియోగించబోమని ప్రతిజ్ఞ చేయిస్తారు. వీటితోపాటు ప్రతీ వార్డు సభలో తడి, పొడి చెత్త వేరు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సేకరణ కోసం ప్రతీ ఇంటికి అనుమతి ఇచ్చేటప్పుడు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవడం చేస్తారు. రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుని, ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement