తెలంగాణపై ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చిందా..! | - | Sakshi
Sakshi News home page

తెలంగాణపై ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చిందా..!

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

● రాజకీయ నాటకం ● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పాతమంచిర్యాల: తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణ కోసం గొంతెత్తుతామని జనసేన పార్టీ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తెలంగాణను అవమానించిన వారితోనే రాజకీయ పొత్తులు పెట్టుకుని.. అన్యాయం చేసిన శక్తులతోనే కలిసి నడుస్తూ ఇప్పుడు తెలంగాణపై ప్రేమ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం ప్రజలను మోసం చేసే రాజకీయ నాటకమని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువత ప్రాణత్యాగాలు చేసినప్పుడు, తెలంగాణను అవమానించే వ్యాఖ్యలు వచ్చినప్పుడు, రాష్ట్రం హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరిగినప్పుడు పవన్‌కల్యాన్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు ఎందుకు స్పందించలేదని అన్నా రు. ఆత్మగౌరవాన్ని అవమానించిన ప్రతీ సందర్భంలో మౌనం పాటించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణకు రక్షకుడిగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ హక్కులను కాపాడేది కాంగ్రెస్‌ పార్టీయేనని, ప్రజల ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడదని, హక్కుల కోసం ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement