మంచిర్యాలక్రైం: అడవుల సంరక్షణ.. చెట్లపై ఉన్న మమకారం.. ప్రకృతిని కాపాడాలనే తపన.. అతన్ని ఐఎఫ్‌ఎస్‌ను చేసింది. అటవీ సంరక్షణే ప్రధాన లక్ష్యంగా విధుల్లో నిబద్ధత పాటిస్తూ ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అడవిని జల్లెడ పట్టేస్తున్నాడు. ఏమూలన ఏ చెట్టు ఉంది.. ఎక్కడ టూరిజానికి అనువైన ప్రాంతమని పరిశోధిస్తున్నాడు.. కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేశారు.. అతనెవరో కాదు.. జిల్లా అటవీశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఐఎఫ్‌ఎస్ 2018 బ్యాచ్‌కు చెందిన కిషన్ జాదవ్. ఆదివారం ‘సాక్షి’ ఆయనతో ఇంటర్వ్యూ నిర్వహించింది.
సాక్షి: మంచిర్యాల డీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడిచింది. ఇప్పటి వరకు అటవీప్రాంతంలో ఏమేం గుర్తించారు?
డీఎఫ్‌వో: మాది మహారాష్ట్రలోని చిన్నవాసీం జిల్లా నెల్కి గ్రామం. నాన్న కిషన్ జాదవ్, అమ్మ వందన. తమ్ముడు సెక్యూరిటిస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం. అటవీ సంరక్షణే ప్రధాన లక్ష్యంగా విధుల్లో చేరా. నా పరిధిలోని అటవీ ప్రాంతమంతా పరిశీలించాల్సిన బాధ్యత నాపై ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించడం వల్ల ఇక్కడి పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది. మంచిర్యాల జిల్లాలో అభయారణ్యం చాలా బాగుంది. టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చాలా వనరులున్నాయి. గాంధారిఖిల్లా, ఏసీసీ క్వారీ, ట్రెక్కింగ్, శివ్వారం మొసళ్ల కేంద్రం, జన్నారం గాంధారి వనం ఉన్నాయి. జిల్లాలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తా.
సాక్షి: కవ్వాల్ అభయారణ్యం, చెన్నూర్ అటవీ ప్రాంతాల నుండి కలప అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై మీరేమంటారు?
డీఎఫ్‌వో: చెట్లతోనే మానవ మనుగడ సాధ్యం. చెట్లను నరకడం వలన మానవుడు మనుగడ కోల్పోతాడు. కలప అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతాం. ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి. చెక్‌పోస్ట్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తా. తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమార్కులకు అధికారులు సహకరించినట్లు మా దృష్టికి వస్తే శాఖపరమైన చర్యలు తప్పవు. ఏస్తాయి అధికారి అయినా ఉపేక్షించేది లేదు. పాత నేరస్తులపై నిఘా ఉంచాం.
సాక్షి: కవ్వాల్ అభయారణ్యంలో పులులు నిలకడగా ఉండేందుకు వాటికి అనువైన అటవీప్రాంతం లేకపోవడంతో ఇక్కడికి వచ్చిన పులులు ఆగడం లేదని తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు?
డీఎఫ్‌వో: కవ్వాల్ అభయారాణ్యం చాలా బాగుంది. లోప ల దట్టమైన అడవి ఉంది. పులులు ఒకచోట స్థిర ంగా ఉండవు. అవి ఆహా రం కోసం కొత్తప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్తాయి. సా ధారణంగా రోజుకు సగటున 15 నుంచి 20 కిలోమీటర్లు నడుస్తాయి. ఇవి పగటి పూట విశ్రాంతి తీసుకుని రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రయాణం చేస్తాయి. కొన్ని మగపులులు కొత్త భూభాగం లేదా ఆడపులి తోడుకోసం వెతుక్కుంటూ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఇటీవల మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన ఒక పులి కేవలం రెండు నెలల్లో 375 కిలో మీటర్ల దూరం ప్రయాణించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
సాక్షి: నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కదా.. మీరు ఐఎఫ్‌ఎస్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
డీఎఫ్‌వో: నాన్నకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో డ్యూటీ. అతని యాక్టివిటీస్, సిస్టమెటిక్, స్ట్రగుల్స్ అన్నీ చిన్నప్పటి నుంచి చూశా. క్రమశిక్షణ, పట్టుదల అక్కడి నుంచే నేర్చుకున్నా. ఆర్మ్‌డ్ ఫోర్స్‌లో ఇండియన్ డిఫెన్స్ అకాడమీలో సెలెక్ట్ అయ్యా. వద్దు సివిల్ సర్వీస్ ట్రై చేయమన్నారు. అయితే నాకు ఫారెస్ట్ అంటే ఇష్టం. అందుకే ఐఎఫ్‌ఎస్ ఎంచుకున్నా.
సాక్షి: జిల్లాలో కొందరు ఎఫ్‌ఆర్‌వో స్థాయి అధికారులు తమకు నచ్చిన బీట్ అధికారి ద్వారా గృహనిర్మాణదారుల వద్ద డోర్‌కు రూ.2 వేలు, కిటికీకి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మీరేమంటారు?
డీఎఫ్‌వో: గృహనిర్మాణ దారులు అక్రమంగా రవాణ చేసిన కలపను వినియోగించరాదు. పర్మిట్ కలపను మాత్రమే ఉపయోగించాలి. అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గృహనిర్మాణదారులవద్ద అటవీ శాఖ అధికారులు వసూళ్లకు పాల్పడినట్లు ఆధారాలు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం.
సాక్షి: వన్యప్రాణుల వేట అధికంగా జరుగుతోంది. వేటగాళ్ల ఉచ్చుకు పులులు బలైన ఘటనలు అనేకం ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
డీఎఫ్‌వో: ఎవరైనా ఉచ్చులు పెట్టి వన్యప్రాణులను హతమారిస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. ఇలాంటి విషయాల్లో ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి సహకరించాలి.


