గుడిహత్నూర్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్రంగా, పలువురి స్వల్ప గాయాలయ్యాయి. మండల కేంద్రానికి 2 కి.మీ దూరంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎండీకే ట్రావెల్స్ బస్సు కేవలం 18 కి.మీ ప్రయాణం చేసిన తర్వాత తెలంగాణ దాబా వద్దకు చేరుకుంది. బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. ఆ సమయంలో బస్సు వెనుక బైక్‌పై వెళ్తున్న మండలంలోని డోంగర్‌గావ్ చెందిన ఇరువురు యువకులకు గాయాలయ్యాయి. కాగా బస్సులో క్లీనర్ ప్రభుదాస్‌తోఆటు గిత్తే భరత్, షేక్ ఆతిక్‌లకు తీవ్రగాయాలు కాగా, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని హైవే అంబులెన్సులో రిమ్స్‌కు తరలించి చికిత్స అందజేశారు. కాగా ఈ స్లీపర్ బస్సులో సుమారు 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ట్రావెల్స్ డ్రైవర్ మహ్మద్ మహబూబ్‌ఖాన్ అతివేగంగా నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


