నియోజకవర్గంలో ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం త్వరలో జైపూర్‌లో 800మెగావాట్ల కొత్త ప్లాంటు ప్రారంభిస్తాం రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్‌వెంకటస్వామి
జైపూర్/రామకృష్ణాపూర్: ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం ఆయన జైపూర్ మండలం ఇందారంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తోఫాను జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి అందజేశారు. మసీదు ప్రాంగణంలో వాటర్‌షెడ్డు ప్రారంభించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏ జోన్ మసీదులో సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని తెలిపారు. చెన్నూర్‌లో రూ.50లక్షలతో షాదీఖానా నిర్మిస్తున్నట్లు చెప్పారు. జైపూర్‌లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటును విస్తరిస్తూ కొత్తగా 800మెగావాట్ల ప్లాంటును త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగావశాలు కల్పిస్తామని, ఆర్కే–5లో కొత్తగా ఓపెన్‌కాస్టు మైన్ ఏర్పడుతుందని అన్నారు. చెన్నూర్‌లో నిర్మిస్తున్న ఏటీసీని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రామకృష్ణాపూర్ పట్టణంలో కబ్రస్తాన్ ఏర్పాటుకు సింగరేణి అధికారులతో మాట్లాడి భూమి కేటాయించామని, త్వరలోనే రూ.30 లక్షలతో పనులు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, సర్పంచ్ ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కోశాధికారి ముక్త శ్రీనివాస్, నాయకులు చల్ల విశ్వంభర్‌రెడ్డి, అబ్దుల్‌అజీజ్, పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


