క్యాంపునకు పోదాం చలో చలో | - | Sakshi
Sakshi News home page

క్యాంపునకు పోదాం చలో చలో

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

క్యాం

క్యాంపునకు పోదాం చలో చలో

ఫలితాలకు ముందే అభ్యర్థుల తరలింపు చంద్రాపూర్‌కు బీజేపీ అభ్యర్థులు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులూ శిబిరానికి సిద్ధం

మంచిర్యాలటౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను శిబిరాలకు తరలించాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండడం, ఫలితాలు ఎలా వస్తాయనేది అంచనాకు అందకపోవడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ తదితర పార్టీలు పోటీ పడ్డాయి. బీజేపీ 58 స్థానాల్లో, బీఆర్‌ఎస్‌ 59స్థానాల్లో పార్టీ తరఫున, ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి 59మంది, సీపీఐ నుంచి ఒకరు పోటీపడ్డారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఫలితాలు ఏ విధంగా వస్తాయనేది అంచనా వేయలేకపోతున్నారు. ఎవరికి వారే మేయర్‌ పీఠాన్ని అధిరోహిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంచనాలు తారుమారై ఫలితాలు కొద్దిగా అటు ఇటు వస్తే పార్టీ మారే అవకాశాలు ఉండడంతో ముందుగానే శిబిరాలకు తరలిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గురువారం ప్రత్యేక బస్సులో చంద్రాపూర్‌కు తరలించారు. బీజేపీ మేయర్‌ అభ్యర్థి గాజుల ముఖేష్‌గౌడ్‌తోపాటు ఇతర అభ్యర్థులు చంద్రాపూర్‌కు వెళ్లి అక్కడి ఆలయాలు, తడోబా సందర్శనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలితాల వెల్లడి తర్వాత ఓడిపోయిన అభ్యర్థులను ఇంటికి పంపించి గెలిచిన వారు చేజారకుండా ఈ నెల 16న మేయర్‌ ఎన్నిక జరిగే వరకు అక్కడే ఉంచేలా ఏర్పాట్లు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా గురువారం రాత్రి శిబిరానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఎక్కడికి అనేదానిపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కంటిమీద కునుకు లేకుండా గడిపిన అభ్యర్థులకు శిబిరాలతో కాస్త ఉపశమనం లభించింది.

లక్సెట్టిపేట..

లక్సెట్టిపేట: లక్సెట్టిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గురువారం క్యాంపులకు తరలివెళ్లారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు తరలివెల్లారు. ఎన్నికల ఫలితాలు వెల్లడి ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా అన్ని విధాల సౌకర్యాలు కల్పించి రహస్య ప్రదేశాల్లో ఉంచినట్లు తెలుస్తోంది.

చెన్నూర్‌ నుంచి..

చెన్నూర్‌: చెన్నూర్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో 18 వార్డుల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆయా పార్టీల అధిష్టానం ఆదేశాల మేరకు ప్రత్యేక వాహనాల్లో శిబిరాలకు తరలివెళ్లారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గురువారం తెల్లవారు జామున క్యాంపునకు వెళ్లగా.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు రాత్రి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా అభ్యర్థుల భర్తలను సైతం తరలించారు. ఈ నెల 16న చైర్‌పర్సన్‌ ఎన్నిక నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులు పార్టీ మారకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా పార్టీలు క్యాంపులు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.

లక్సెట్టిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, నాయకులు

మాజీ ఎమ్మెల్యే చిన్నయ్యతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

వేర్వేరుగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీలో పోటీ చేసిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గురువారం రాత్రి వేర్వేరుగా రహస్య శిబిరానికి తరలివెళ్లారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వారిని శిబిరాలకు తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ పర్యవేక్షణలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు 23మంది ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యలయం నుంచి బస్సులో వెళ్లారు. మిగతా 11మంది వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఫలితాల వెల్లడి తర్వాత వెళ్లే యోచనలో కొందరు ఉన్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యవేక్షణలో 34మంది అభ్యర్థులు తిరుమలహిల్స్‌ నుంచి బస్సులో వెళ్లారు. అభ్యర్థులంతా కలిసికట్టుగా వ్యవహరించాలని, ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చే పిలుపులకు స్పందించవద్దని సూచించినట్లు తెలిసింది. ఈ నెల 15న రాత్రి, లేదా 16న తెల్లవారుజామున బెల్లంపల్లికి చేరుకునే అవకాశాలున్నాయి. ఆ రోజు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లను ఎన్నుకోనున్నారు.

క్యాతనపల్లిలో..

రామకృష్ణాపూర్‌: క్యాతనపల్లి మున్సిపాల్టీలో 22 వార్డులు ఉన్నాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటే వారికే మున్సిపల్‌ పీఠం దక్కే అవకాశం ఉండడంతో పోటీ చేసిన అభ్యర్థులను శిబిరాలకు తరలిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీతోపాటు బీఆర్‌ఎస్‌, సీపీఐ ఉమ్మడి అభ్యర్థులు వేర్వేరుగా శిబిరాలకు తరలి వెళ్లారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను పోలింగ్‌ ముగిసిన బుధవారం రాత్రే తరలించగా.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తమ అభ్యర్థులను గురువారం తరలించారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు తర్వాత బలాబలాలను పరిశీలించి మెజార్టీ సాధించన వారు నేరుగా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్న తమ తమ పార్టీల అభ్యర్థులను మరెవరూ లాగేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రి గడ్డం వివేక్‌ తన నియోజకవర్గంలోని చెన్నూర్‌, క్యాతనపల్లి మున్సిపాల్టీలను ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తుండగా.. మరోవైపు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

క్యాంపునకు పోదాం చలో చలో1
1/2

క్యాంపునకు పోదాం చలో చలో

క్యాంపునకు పోదాం చలో చలో2
2/2

క్యాంపునకు పోదాం చలో చలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement