ప్రథమ పౌరులెవరో..!
మేయర్, చైర్‌పర్సన్ పీఠాలపై సస్పెన్స్ గెలిచి రిజర్వేషన్ కలిసొచ్చిన ముఖ్యులంతా పోటీ ఫలితాల వెల్లడికి ముందే సమీకరణాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. రాజకీయ పార్టీల నాయకులతోపాటు నగర, పట్టణ వాసుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలిసారి నగరంగా అవతరించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మంచిర్యాల బల్దియా పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి పట్టణాల్లోనూ ఏ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థులను ప్రకటించలేదు. లక్సెట్టిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ అభ్యర్థులను ప్రకటించింది. ఇక బీజేపీ మేయర్ అభ్యర్థిగా గాజుల ముఖేష్‌గౌడ్‌ను ప్రకటించింది. మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తమ మేయర్, చైర్‌పర్సన్ అభ్యర్థులను ప్రకటించకుండా గోప్యతను పాటిస్తున్నాయి. ఓ వైపు ఓట్ల లెక్కింపు మొదలు కాకముందే పోటీ చేసిన అభ్యర్థులను పార్టీలు క్యాంపులకు తరలించాయి. ఈ నెల 16న మేయర్, చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. ప్రత్యక్షంగా చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నికై న కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సమక్షంలో ఎన్నుకుంటారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ క్రమంలో మెజార్టీ స్థానాలు గెలిస్తేనే పీఠాలు దక్కనున్నాయి. మొత్తం సభ్యుల్లో సగానికిపైగా ఉన్నవారికే మెజార్టీగా పరిగణిస్తూ ఎన్నుకోనున్నారు. అలాగే పార్టీ గుర్తులతో ఎన్నిక కావడంతోనూ ఆయా పార్టీల నుంచి విప్(ఆజ్ఞ) జారీ చేస్తారు. దీంతో ఏ ఒక్కరు కూడా ప్రలోభాలకు లోనుకాకుండా ముందుగానే తమ ఆధీనంలో ఉంచుకునేందుకు క్యాంపులకు తరలించారు.
ఎవరి ధీమా వారిదే
మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసకుంటుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మున్సిపల్ పీఠాలపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ సైతం ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల నగరంలో 60డివిజన్లలోనూ మ్యాజిక్ ఫిగర్‌కు 31స్థానాల్లో కాకున్న కింగ్‌మేకర్‌గా అవుతామని బీజేపీ నాయకులు నమ్మకంతో ఉన్నారు. అభ్యర్థులను చంద్రాపూర్‌కు తరలించి ముందు జాగ్రత్తపడింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను సైతం జిల్లా దాటించేందుకు రంగం సిద్ధమైంది. బీఆర్‌ఎస్ నాయకులు సైతం జిల్లా ఆవలే ఉంటున్నారు. కొందరు క్యాంపులకు వెళ్లక స్థానికంగానే ఉన్నారు. చైర్‌పర్సన్, మేయర్ అభ్యర్థులుగా చెప్పుకుంటున్న వారు డబ్బులు ఖర్చు చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అధికార పార్టీలో ఈ పోటీ అధికంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యేలే ఈ పదవుల ఎంపికలో కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు అధి ష్టానం ఆశీర్వాదం కూడా ఉండేలా కొందరు గాంధీ భవన్ స్థాయిలోనూ లాబీయింగ్ మొదలు పెట్టిన ట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో పుర పీఠాల ను అధిష్టించే వారి పేర్లు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.


