శాశ్వత సౌకర్యాలు లేక..
సమీపిస్తున్న సమ్మక్క–సారలమ్మ పండుగ వేలాదిగా వచ్చే భక్తులకు అరకొర సౌకర్యాలు తాగునీరు, స్నానాల గదులు, మరుగుదొడ్ల నిర్వహణ ప్రధానం పాతవాటికే రంగులు వేస్తున్నారనే విమర్శలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని గోదావరి నదీతీరంలో రెండేళ్లకోసారి సమ్మక్క–సారలమ్మ జాతర సాగుతుంది. ఈ నెల 28నుంచి 31వరకు మూడు రోజులపాటు సాగే జాతరకు వేలాదిగా భక్తజనం తరలి రానుంది. మంచిర్యాలతోపాటు సమీప గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. గోదావరి పుష్కరఘాట్ వద్ద సమ్మక్క–సారలమ్మ గద్దెలతోపాటు సమీప ప్రాంతాలు అనేకమంది రాకతో కిక్కిరిసిపోతాయి. భక్తులకు సరిపడా వసతులు కల్పించాల్సిన దేవాదాయ శాఖ ఈ ఏడాది నిధులు విడుదల చేయలేదు. దీంతో మంచిర్యాల నగర పాలక సంస్థ నుంచే రూ.26.40లక్షలు కేటాయించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ ఇతర సౌకర్యాల కల్పన కోసం ఈ నిధులు వెచ్చిస్తున్నారు. ఇక జాతరలో ఏర్పాటు చేసే తాత్కాలిక దుకాణాల కోసం వేలం వేయగా రూ.12.39లక్షల ఆదాయం వచ్చింది. ఇక హుండీ ఆదాయం సైతం దేవాదాయ శాఖకు వెళ్లనుంది. కానీ నగర పాలక సంస్థ నుంచి నిధులు ఖర్చు చేస్తూ పనులు చేయిస్తున్నారు.
అపరిశుభ్రంగానే పరిసరాలు
జాతర జరిగే మూడు రోజులపాటు మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఏటా అవస్థలు కలుగుతున్నా, సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించడం లేదు. ముఖ్యంగా మహిళల స్నానాల గదులు, దుస్తులు మార్చుకునే గదులు సరిపోవడం లేదు. పుష్కర ఘాట్ పక్కనే గతంలో నిర్మించిన వాటికే ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కుళాయిలతో స్నానాలు ఆచరించాల్సి ఉంది. కాళ్లు కడుక్కునే కుళాయిలు కింద భాగంలో ఏర్పాటు చేశారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, చుట్టు పరిసరాలు, ఆలయం వెనుక భాగం వైపు చదును చేయాల్సి ఉంది. మాతాశిశు సంరక్షణ కేంద్రం పక్కనే గతంలో నిర్మించిన తాత్కాలిక మరుగుదొడ్లు భక్తులు వినియోగించే స్థితిలో లేవు. నదీ తీరం వెళ్లే మరోవైపు గోదావరి పుష్కరఘాట్ పరిధిలో నిత్యం కర్మకాండలు, పుణ్యస్నానాలకు అనేకమంది వస్తుంటారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం నదీ పరిసర ప్రాంతాల్లోనే వేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారంతో కనిపిస్తున్నాయి. మున్సిపల్ కార్మికులు అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు.
రెండేళ్లకోసారి జాతరలో భక్తుల రద్దీ పెరుగుతున్నా నిర్వహణపై స్పష్టమైన విధి విధానాలు కరువయ్యాయి. దేవాదాయ శాఖ నుంచి నిధుల కేటాయింపులు లేక అభివృద్ధి కొరవడుతోంది. గోదావరి పుష్కరఘాట్ పరిధిలోని వసతులనే ఉపయోగించుకోవాల్సి వస్తోంది. ఈసారి కూడా జాతర పనుల కోసం మొత్తంగా రూ.26లక్షలకు పైనే ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కొత్త పనుల్లేక, గతంలో ఉన్న వాటికే రంగులు వేస్తున్నారు. జాతర జరిగే ప్రధాన ప్రాంగణమైన అమ్మవార్ల గద్దెలు, పరిసరాలు, టెంట్లు, కొబ్బరికాయలు కొట్టే స్థలం, క్యూలైన్లు, రాత్రివేళ వెలుగు కోసం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. భక్తులకు సరిపడా తాగునీరు అందించాల్సి ఉంది. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులకు తాత్కాలిక మరుగుదొడ్ల సదుపాయాలు అరకొరగా ఉన్నాయి. దీంతో బహిరంగంగానే చీరలు, పరదాలు కట్టుకుని బట్టలు మార్చుకోవాల్సి వస్తోంది. మరుగుదొడ్లు సరైన తీరుగా నిర్వహించకపోవడంతో నదీ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఇక కొందరు జాతర స్థలంలోనే రాత్రి నిద్ర చేసేందుకు వస్తే అసౌకర్యాల మధ్యే ఉండాల్సి వస్తోంది. మరోవైపు వాహనాల పార్కింగ్‌కు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్కువ ఖర్చులో శాశ్వత ప్రాతిపదికన ఉండే అధునాతన బయోటాయిలెట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చొరవ చూపడం లేదు. తాత్కాలిక వసతులతోనే జాతర నిర్వహిస్తూ శాశ్వత సౌకర్యాలపై దృష్టి సారించడం లేదు. దీంతో భక్తులకు అసౌకర్యాల తిప్పలు తప్పేలా లేవు.
శాశ్వత సౌకర్యాలు లేక..
శాశ్వత సౌకర్యాలు లేక..
శాశ్వత సౌకర్యాలు లేక..


