జోరుగా ‘బంగారం’ మొక్కులు
ముల్కల్ల గోదావరిలో పుణ్యస్నానాలు, పూజల్లో భక్తులు
డప్పుచప్పుళ్ల మధ్య బంగారంతో తరలివెళ్తున్న భక్తులు
మంచిర్యాలలో నిలువెత్తు బంగారం తూకం వేయిస్తున్న తల్లి, కొడుకు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో సమ్మక్క–సారలమ్మ జాతర సందడి మొదలైంది. కోరికలు నెరవేరిన భక్తులు తల్లలకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పిస్తుండడంతో సందడి నెలకొంది. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం దుకాణాల్లో ని త్రాసులో కూర్చుని ఎత్తు బంగారం కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇళ్లలో మేకలు, కోళ్లతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించి బంగారం పంచి పెడతారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతోపాటు మహారా ష్ట్రలోని లాథూర్, నాందేడ్, నాగ్‌పూర్ నుంచి జిల్లాకు బెల్లం దిగుమతి అవుతోంది. బుధ, గురు, శుక్ర, ఆది వారాల్లో బెల్లం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. రోజుకు 50 నుంచి 80టన్నుల వ్యాపారం సాగుతోంది. జాతర ముగిసే వరకు దాదాపు రెండు వేల టన్నులకు పైగా బెల్లం వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంటున్నారు. ఈ ఏడాది ఎత్తు బెల్లం తూకం వేయించే వారిని ఆకట్టుకునేలా లక్కీడ్రాలు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. మేడారం సమ్మక్క మహా జాతరకు తరలి వెళ్లే భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. బుధవారం ముల్కల్ల, మంచిర్యాల గోదావరి తీర ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు.
జోరుగా ‘బంగారం’ మొక్కులు
జోరుగా ‘బంగారం’ మొక్కులు


