
మానసిక స్థిరత్వం.. ప్రశాంత జీవనం
క్షణికావేశంతో కుటుంబాలు చిన్నాభిన్నం ఒత్తిడి, మానసిక సంఘర్షణలో నేటి సమాజం ఆలోచిస్తే పరిష్కారం సులువే అంటున్న నిపుణులు నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
మానసిక ఆరోగ్య సహాయం: టోల్ ఫ్రీ నంబర్: 14416 లేదా 1800 891 4416
నిర్మల్‌ఖిల్లా: శారీరక ఆరోగ్యం ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే జీవితం అస్థిరమవుతుంది. నేటి వేగవంతమైన జీవనశైలిలో స్వీయ నియంత్రణ లోపం, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, అహంభావం వంటి కారణాలు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ మానసిక ఆరోగ్యసంస్థ ఆధ్వర్యంలో 1994వ సంవత్సరం నుంచి ఏటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సంవత్సరం 2025 థీమ్: సమాజపు మానసిక శ్రేయస్సును బాధ్యతగా సంరక్షిద్దాం’. ఈనేపథ్యంలో సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.
చిన్న విభేదాలు, పెద్ద విషాదాలు
ఇటీవల నిర్మల్ జిల్లా సహా పలు ప్రాంతాల్లో, చిన్న కుటుంబ విభేదాలు ప్రాణ నష్టాలకు దారితీస్తున్నాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆర్థిక ఒత్తిడి, అనుమానాలు, అహంభావం–ఇవన్నీ కలిసిమెలిసి విషాదాంతాలు సృష్టిస్తున్నాయి. తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు, సోదరీమణుల మధ్య కూడా చిన్న కారణాలు పెద్ద విభేదాలకు దారితీస్తున్నాయి. వ్యవసాయం, వ్యాపారం లేదా ఉద్యోగంలో నష్టాలు కూడా జీవితాలను ముగించే పరిస్థితులను తెస్తున్నాయి.
మానసిక నియంత్రణ రక్షణ కవచం
మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలా సమస్యలు క్షణికావేశం వల్లే విషాదానికి దారితీస్తున్నాయి. ఒక్క క్షణం మౌనం, ఆలోచనతో కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. స్వీయ నియంత్రణతో మనస్సును స్థిరపర్చుకోవడం అత్యంత అవసరం. కుటుంబంలో తగాదా వచ్చినపుడు ప్రేమతో, అవగాహనతో పరిష్కారం కనుగొనాలి. కోపం, అహం విభేదాలను పెంచుతాయి. ఒక క్షణం ఆలోచిస్తే ప్రాణాలు మాత్రమే కాకుండా, సంబంధాలు, ప్రేమ కూడా నిలుస్తాయి. కాగా, జిల్లాలో భరోసా కేంద్రాలు, సఖీ, షీటీమ్ వంటి వ్యవస్థలు తోడ్పాటునందిస్తున్నాయి. మానసిక నిపుణులు అందుబాటులో ఉన్నారు.