
మోయలేని భారం..
లక్ష్మణచాంద: కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) పరిధిలో ప్రైవేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులపై ఫీజుల భారం పెరిగింది. మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్ష ఫీజు నిరుపేద, మధ్యతరగతి వారికి భారంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ఈనెల 15 వరకు ఫీజు చెల్లించాలని కేయూ ప్రకటించింది. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు గతేడాది పోల్చితే మూడింతలుగా పెరిగింది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో గత సంవత్సరం చేరిన విద్యార్థులు మొదటి సెమిస్టర్‌లో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.80, ప్రాసెసింగ్ రూ.300, స్టూడెంట్ రికగ్నిషన్ రూ.300, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ రూ.50, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ రూ.60 ఇలా మొత్తం రూ.790 చెల్లించారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1200, స్టూడెంట్ రికగ్నిషన్ రూ.800, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ రూ.300, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ రూ.200 ఇలా మొత్తం రూ.2500కు పెంచారు. దీంతోపాటు మొదటి సంవత్సరం పరీక్ష ఫీజు రూ.750 కలిపి మొత్తం రూ.3250 చెల్లించాల్సి రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదువుకు దూరం
గత నాలుగేళ్ల నుంచి ప్రైవేటు డిగ్రీ కళాఽశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రథమ సెమిస్టర్ రాసే విద్యార్థులకు విశ్వవిద్యాలయానికి చెల్లించాల్సిన ఫీజులను మూడింతలు పెంచింది. దీంతో చెల్లించలేక డిగ్రీ చదువులకు దూరమవుతామని పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు పెంచిన పరీక్ష ఫీజులు తగ్గించి చదువు కొనసాగించేలా చూడాలని కోరుతున్నారు.
కేయూ పరిధిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు
జిల్లాలు సంఖ్య
నిర్మల్ 26
ఆదిలాబాద్ 22
మంచిర్యాల 15
కుమురంభీం 5
మొత్తం 68
(సుమారు 3 వేల మంది
ఫస్టియర్ చదువుతున్నారు)