
రేపు కోర్టు భవనాలకు శంకుస్థాపన
నస్పూర్: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోర్టు భ వనాల సముదాయం నిర్మాణానికి ఎట్టకేలకు మూ హూర్తం ఖరారైంది. జిల్లా కేంద్రంలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న కోర్టులకు ఇంటిగ్రేటెడ్ భవన సముదాయం ఏర్పాటుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నస్పూర్ పట్టణ శివారులోని సర్వేనంబరు 42లో ఐదెకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.81కోట్లతో పోక్సో, ఫ్యామిలీ తదితర 12 కోర్టుల భవనాలు నిర్మించనున్నారు.
ఎన్నో అడ్డంకులు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాలో కోర్టులకు శాశ్వత భవన నిర్మాణాలకు నిర్ణయించారు. జిల్లా కేంద్రంలోని రామునిచెరువు వద్ద ఎకరం పది గుంటల స్థలాన్ని అధికారులు కేటాయించారు. ఆ స్థలం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని వస్తుందని ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాలేజీ రోడ్డులోని భూదాన్ భూమి గర్మిల్ల శివారులో 708, 709లో ఐదెకరాలు కేటాయించారు. ఆ స్థలం గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో భవనాల నిర్మాణాలు చేపట్టరాదని సంబంధిత అధికారులు అభ్యంతరం తెలిపారు. అనంతరం నస్పూర్ శివారులోని 42సర్వేనంబరులో ఐదెకరాలు కేటాయించగా స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేసు వీగిపోవడంతో భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది.
వర్చువల్‌గా..
ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్‌సింగ్ హైదరాబాద్ నుంచి శనివారం వర్చువల్‌గా ప్రారంభిస్తారు. నస్పూర్‌లో జరిగే కార్యక్రమానికి హైకోర్టు జడ్జి నగేష్ భీమపాక, జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెక్షన్ జడ్జి ఏ.వీరయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, జనరల్ సెక్రెటరీ కే.మురళీకృష్ణ హాజరు కానున్నారు.