
ఎద్దుకు సాయం చేయబోయి..
బెల్లంపల్లిరూరల్: మూగజీవికి సాయం చేయడానికి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బుధాకుర్థు గ్రామానికి చెందిన జంగపల్లి రాజారాం (69) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం ఓ పని నిమిత్తం ఇంటి నుంచి రవీంద్రనగర్‌కు కాలినడకన బయలుదేరాడు. రోడ్డుపై నడుస్తున్న క్రమంలో ఓ ఎదు ముక్కు తాడు విడిపోయి ఇబ్బంది పడడాన్ని గమనించాడు. ఎద్దు దగ్గరికి వెళ్లి ముక్కుతాడు సరి చేస్తుండగా అది రాజారాంను పొట్ట భాగంలో కొమ్ములతో పొడిచింది. అంతటితో ఆగకుండా కొమ్ములతో అతడిని లేపి విసిరి వేసింది. దీంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి బలంగా కొట్టుకున్న రాజా రాంకు తీవ్ర గాయాలై రక్తస్రావం కాగా కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజారాం మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎదుకు సాయం చేయబోయి రాజారాం ప్రాణాలు పోగొట్టుకోగా గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నేత్రదానం
జంగపల్లి రాజారాం నేత్రాలను సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేకరించి ఎల్‌వీ ప్రసాద్ ఐ బ్యాంక్‌కు పంపించారు. కార్యక్రమంలో వైద్యుడు సతీశ్, జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీశ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.