
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేపట్టాలి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
కాగజ్‌నగర్‌టౌన్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మించిన కా ళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ఆయకట్టులో ఎన్ని ఎకరాలకు సాగు నీరందుతుందని, ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్‌ఎస్ పార్టీ ఏటీఎం లాగా వాడుకుందని ఆరోపించారు. ఘోష్ ప్యానల్ నివేదిక ప్రకారం అవినీతి జరిగిందని స్పష్టమైందని, కేసీఆర్ కుటుంబం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వ్యర్థం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయకుండా కాంట్రాక్టర్లు, నాయకులతో కుమ్మకై వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలంటే తుమ్మిడిహెట్టిలోని వార్ధా, పెన్‌గంగ నదుల సంగమం వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత తదితరులు పాల్గొన్నారు.