
ఆర్‌ఎంపీ క్లినిక్‌ల్లో ఆకస్మిక తనిఖీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌లను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర యగ్గన్న శ్రీనివాస్ నేతృత్వంలోని టీజీఎంసీ బృందం శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లో ఇటీవల ఓ ఆర్‌ఎంపీ వద్ద చికిత్స తీసుకున్న ఓ యువకుడు వైద్యం వికటించి మృతిచెందినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీజీఎంసీకి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో టీజీఎంసీ సభ్యులు ఆర్‌ఎంపీ కేంద్రాలను శుక్రవారం రాత్రి వరకు తనిఖీ చేశారు. కనీస విద్యార్హతలు, లైసెన్స్ లేకుండా వైద్యులమని ఎలా చెప్పుకుంటున్నారని, ఇంజక్షన్లు, మందులు, గర్భవిచ్ఛిత్తి ఇంజక్షన్లు ఎందుకు ఉన్నాయంటూ మందలించినట్లు సమాచారం. ఓ క్లినిక్‌లో రెండు పడకలు ఏర్పాటు చేసి రోగికి యాంటీబయోటిక్ ఇంజక్షన్ కూడా ఇస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో డాక్టర్ సంతోష్, డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.