
గుజరాత్ నుంచి జిల్లాకు వచ్చిన బ్యాలెట్ బాక్సులతో డీపీవో వెంకటేశ్వరావు, అధికారులు
గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు రాక
శిక్షణ, పోలింగ్ కేంద్రాలు, అన్ని ఏర్పాట్లు పూర్తి
రిజర్వేషన్లు తేలక ఎన్నికల నిర్వహణలో జాప్యం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సమరానికి అంతా సిద్ధమైంది. తాజాగా గుజరాత్‌లోని జామ్ నగర్, ద్వారక జిల్లాల నుంచి 970 బ్యాలెట్ బాక్సులను పంచాయతీ అధికారులు గురువారం జిల్లాకు తీసుకొచ్చారు. ఎలక్షన్ ఆమోదం ఉన్న ఈ బ్యాలెట్ బాక్సులను వాటిని నస్పూర్‌లోని సీఐఎస్‌ఎఫ్ క్వార్టర్స్‌లో బందోబస్తు మధ్య సురక్షితంగా భద్రపర్చారు. జిల్లాలో ఇప్పటికే 3,700 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. వీటికి అదనంగా ఈ బాక్సులు తీసుకొచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రెండు నెలల క్రితమే తొలి విడత ఆర్వో(రిటర్నింగ్ ఆఫీసర్ల) శిక్షణ పూర్తయింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి మరోసారి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, సౌకర్యాల కల్పన పూర్తయ్యాయి.
జిల్లాలోని ఓటర్ల జాబితా సిద్ధం అయ్యింది. జాప్యంతో మరోమారు మార్పులు చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. తుది జాబితా వెలువడనుంది. జిల్లాలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అటు పంచాయతీ రాజ్, పరిషత్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రెండు నెలల నుంచే కసరత్తు మొదలైనప్పటికీ రిజర్వేషన్లు తేలక ముందుకు సాగలేదు. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేదానిపై స్పష్టత రావడం లేదు.
తేలని రిజర్వేషన్ల పంచాయితీ
పల్లెలు, పట్టణాల్లో పాలక వర్గాలు లేక స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదల కాక పాలన సజావుగా సాగడం లేదు. పాలక వర్గాలు లేక ఏడాదికి పైగా అవుతోంది. హైకోర్టు సైతం సెప్టెంబర్‌లోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంపుదల చట్టంపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గత చట్టాన్ని సవరిస్తూ రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీ స్థాయిలో పోరాడుతోంది. రిజర్వేన్ల పెంపుపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తేలని, చెప్పలేని పరిస్థితి ఉంది. రెండు నెలల క్రితమే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. రెండు దశల్లో నిర్వహణ అంటూ ప్రచారం జరగడంతో ఆశావహులంతా సిద్ధమయ్యారు.
స్థానిక నాయకులు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం మొదలైనప్పటికీ రిజర్వేషన్లు తేలకపోవడంతో స్థబ్దుగా మారింది. మరోవైపు పంచాయతీ, పరిషత్ ఎన్నికలు పూర్తయితే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో పట్టణాల్లో ఉన్న నాయకులు, పోటీ చేసే అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తేనే, పంచాయతీలు, వార్డులు, పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
జిల్లా ; వివరాలు
గ్రామ పంచాయతీలు; 306
వార్డులు; 2,680
ఎంపీటీసీలు; 129
ఎంపీపీలు; 16
జెడ్పీటీసీలు; 16
జిల్లా పరిషత్; 01
పోలింగ్ కేంద్రాలు; 2,680
బ్యాలెట్ బాక్సులు; 4,670