
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అన్ని రంగాల్లో వారి ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహిస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌తో కలిసి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మరో నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని, మహిళా సంఘాల ద్వారా నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొబైల్ షిప్ కార్యక్రమం హాజీపూర్ మండలంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారని, భీమారం, బెల్లంపల్లి మండలాలకు మరో రెండు మంజూరు చేశామని అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్ నిర్వహణ మందమర్రి మండలానికి మంజూరైనట్లు తెలిపారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, మరో ప్లాంట్‌కు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
మంచిర్యాలఅగ్రికల్చర్: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్‌తో కలిసి పోలీసు, రవాణా, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఆర్టీసీ, అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ ఏడాదిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 47 మంది లైసెన్స్‌లు రద్దు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవికుమార్, జిల్లా రవాణా అధికారి సంతోష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
పనులు పూర్తి చేయాలి
జైపూర్: భీమారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం ఆయన ఎంపీడీవో సతీశ్‌తో కలిసి పనులు పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు సౌకర్యాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదులు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు, దాంపూర్‌లో అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి భుక్య ఛత్రునాయక్, తహసీల్దార్ సదానందం, ఎస్సై శ్వేత పాల్గొన్నారు.