
ఐదు సార్లు విఫలమైనా వెన్నుతట్టారు
మాది ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామం. నాన్న సత్యనారాయణ జర్నలిస్టు. చిన్నప్పటి నుంచి ఆయనే నాకు స్ఫూర్తి. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను ఐఆర్‌ఎస్‌గా ఎంపికయ్యానంటే అది నాన్న అందించిన ప్రోత్సాహమే. చదువు ప్రాధాన్యతతో పాటు ఎన్నికష్టాలు ఎదురైనా లక్ష్యసాధనను మాత్రం వీడొద్దని ఆయన నుంచే నేర్చుకున్నా. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇంద్రవెల్లిలో చదివాను. 6నుంచి 10 వరకు కాగజ్‌నగర్ జవహర్ నవోదయలో, ఇంటర్మీడియెట్ హైదరాబాద్‌లో పూర్తిచేశా. ఐఐటీ గౌహతిలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక సివిల్స్‌కు సన్నద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలో 12 మార్కులతో వెనుకబడ్డాను. రెండో ప్రయత్నంలో మెయిన్స్ కూడా రాలేదు. ఇలా ఐదు ప్రయత్నాల్లో నిరాశే ఎదురైంది. ఆరో ప్రయత్నంలో ఢిల్లీలో కోచింగ్ తీసుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అయినా నా చదువు, భవిష్యత్తు విషయంలో నాన్న ఎప్పుడూ రాజీ పడలేదు. అనునిత్యం నాలో ఆత్మవిశ్వాసం నింపుతూ ప్రోత్సహించారు. పరీక్షలు రాసే సమయంలో భోజనం కూడా చేయకుండా ఓపికగా సెంటర్ వద్దే బయట వేచి ఉండేవారు. ఆరో ప్రయత్నంలో 790వ ర్యాంకు సాధించాను. ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని ఐఆర్‌ఎస్ శిక్షణ సంస్థలో ఇన్‌కంటాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా శిక్షణ పొందుతున్నా. ఇది ముమ్మాటికీ మా నాన్న అందించిన విజయమే. – శుభం రేకుల్వర్, ఐఆర్‌ఎస్