
పలు రైళ్ల హాల్టింగులు రద్దు
తాండూర్: మండలంలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్ల హాల్టింగులను జూన్ 30వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం రోడ్–విజయవాడ (ట్రైన్ నంబర్ 07278/ 07979), సికింద్రాబాద్–వరంగల్ (ట్రైన్ నంబర్ 07462/07463), కాజీపేట్–బల్లార్షా (ట్రైన్ నంబర్ 17035/17036), సిర్పూర్ టౌన్–కరీంనగర్ (ట్రైన్ నంబర్ 07766/ 07765), కరీంనగర్–బోధన్ (ట్రైన్ నంబర్ 07894/ 07893) రైళ్లు అప్ అండ్ డౌన్ రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వేతనాలు చెల్లించాలి
రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియాలోని ఆర్కేపీ సీహెచ్‌పీలో విధులు నిర్వహిస్తున్న 16 మంది కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఐఎఫ్‌టీయూ అనుబంధ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు బుధవారం సీహెచ్‌పీలో ఆందోళన చేపట్టారు. షేల్ పికింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఐదునెలలుగా వేతనాలు చెల్లించకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సదరు కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందం, గజ్జి మల్లేశ్, మహేశ్వర్‌రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.