ఈ జీవితం నీకై నువ్వు తెచ్చుకున్నది కాదు, ఆత్మహత్య చేసుకునే హక్కు నీకెక్కడిది?

Exams comes and Go, Marks are just a criteria, but life is ultimate, No suicides please - Sakshi

మార్కులు, ర్యాంకులే కొలమానం కాదు..

ప్రముఖులెందరో చదువుల్లో పరాజితులే

కఠిన నిర్ణయాలు సబబు కాదంటున్న మానసిక నిపుణులు

నిర్మల్‌ ఖిల్లా: జీవితం అంటే చదువులు, మార్కులు, ర్యాంకులు, ఉన్నత ఉద్యోగాలు మాత్రమే కాదు. ఇవన్నీ విజయానికి కొలమానాలు కానేకాదు. మరి ఎందుకు చదువుకోవాలి.. దాని పరమార్థం ఏమిటి? మన జీవితంలో చదువు, కెరీర్‌ల పాత్ర ఏమిటి? గొప్పగొప్ప వాళ్లంతా పెద్దపెద్ద చదువులు చదివినవాళ్లేనా? ... పలు పరీక్షా ఫలితాల నేపథ్యంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఒత్తిడే కారణం..

ఇంటర్‌, పదో తరగతి, నీట్‌, ఎంసెట్‌, ఐఐటీ, పోటీ పరీక్షలు ఏవైనా ఫలితాల సమయంలో ఒత్తిడి సహజం. వీటి ప్రభావంతో తీసుకున్న కఠిన నిర్ణయాలైన ఆత్మహత్యలు అప్పుడప్పుడూ తీవ్ర దిగ్భాంతిని కలిగిస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్‌ ఇతర ప్రవేశ పరీక్షల్లో ఫెయిల్యూర్‌ను విద్యార్థులు భరించలేకపోవడం దీనికి ముఖ్యకారణం. ఇంటి నుంచే కాకుండా.. సమాజం నుంచి కూడా వచ్చే ఒత్తిడి దీనికి కారణమని మానసిక నిపుణులు అంటున్నారు.

చదువు తెలివితేటల కోసమే..

తల్లిదండ్రులు తిడతారని ఒకరు.. స్నేహితుల వద్ద తలెత్తుకులేమని ఇంకొకరు.. సమాజంలో పరువు పోతుందని మరొకరు.. ఇలా ఏదో కారణంతో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. చదువులో వెనకబడి ఉండి కూడా జీవింతంలో ఊహించని సక్సెస్‌ అందుకున్న వాళ్లు కోకొల్లలు. డిగ్రీ పట్టా లేకపోయినా వివిధ రంగాల్లో అసమాన్య ప్రతిభ కనబర్చినవారు బోలెడుమంది ఉన్నారు. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయితే అదేం జీవితంలో ఫెయిల్‌ అయినట్టు కాదు.

విద్యార్థులకు మరో అవకాశం ఉంటుంది. సప్లిమెంటరీలు రాసి మళ్లీ పాస్‌ కావచ్చు. క్రీడలు, సినిమా, బిజినెస్‌ లాంటి పలురంగాల్లో అవకాశాలు చాలా ఉన్నాయి. చదువు నిన్ను అవగాహన పరంగా మరో మెట్టు ఎక్కించడానికి మాత్రమే. చదువులో ఫెయిల్‌ అయితే బతుకులో ఫెయిల్‌ అయినట్టు కాదు. సరిగ్గా అనుకుంటే చులకనగా చేసిన సమాజం ముందే తలెత్తుకొని జీవించవచ్చు. వివిధ రంగాల్లో ఉన్నతంగా ఎదిగిన అలాంటి వ్యక్తుల ఉదాహరణలు మచ్చుకు కొన్ని....

సుభాష్‌ చంద్ర గోయెంకా, వ్యాపార వేత్త

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, ఎంటర్‌ప్రెన్యూర్‌ నారాయణ మూర్తి, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఎయిర్‌ డెక్కన్‌ కెప్టెన్‌ గోపినాథ్‌, వరల్డ్‌ చాంపియన్‌ సుశీల్‌ వ్యాపార వేత్త సుభాష్‌చంద్ర గోయెంకా వీరందరి ప్రయాణం ఉన్నత చదువులతో ప్రారంభం అవ్వలేదు. అభిరుచి కలిగిన రంగంలో స్వయంకృషితో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలను ఎదుర్కొని కష్టపడి ఎదిగినవాళ్లు. ఇంటర్‌ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని, పదిలో ఫెయిల్‌ అయ్యారని తనువు చాలించాలనే నిర్ణయానికి రావడం సబబేనా.. ఓ సారి ఆలోచించండి..

కమల్‌హాసన్‌.. సినీనటుడు

నటనలో యావత్‌ భారతాన్ని ఒక్క ఊపు ఊపిన వారిలో కమల్‌హాసన్‌ ఒకరు. ఆయన చిన్నప్పుడు స్కూల్‌ డ్రాప్‌ అవుట్‌. పదో తరగతి కూడా చదవలేదు. అయితే నేం నాలుగు దక్షిణ భారత భాషల్లో అనర్గళంగా మాట్లాడటం, రాయటం, చదవడంపై పట్టుసాధించాడు. కమల్‌హాసన్‌ నటుడు మాత్రమేకాదు రచయిత, డైరెక్టర్‌, ప్రొడ్యుసర్‌, ప్లేబ్యాక్‌ సింగర్‌.. మల్టీటాలెంటెడ్‌ స్టార్‌గా ఎదిగాడు.

మహేంద్రసింగ్‌ ధోని.. క్రికెట్‌ ఆటగాడు

మనదేశ ప్రఖ్యాత క్రికెటర్లలో ఒకరైన మహేంద్ర సింగ్‌ ధోనికి తన చిన్నతనంలో చదువు పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. చిన్నప్పుడు బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌ ఆటలు ఆడేవాడు. ధోనీ గోల్‌ కీపర్‌గా ఫుట్‌బాల్‌ ఆడుతున్నప్పుడు, అతడి కోచ్‌ అతడిని స్థానిక క్రికెట్‌ క్లబ్‌లో వికెట్‌ కీపర్‌గా ఆడటానికి ఎంపిక చేశాడు. కాలక్రమేణా క్రికెట్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ధోని కుటుంబాన్ని పోషించుకోవడానికి రైలు టిక్కెట్‌ ఎగ్జామినర్‌గా పనిచేశాడు. 2004లో భారత క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యాడు. భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎదిగి ఎన్నో రికార్డులను సాధించాడు.

డాక్టర్‌ వెల్మల మధు

దిలావర్‌పూర్‌ మండలం లోలం గ్రామానికి చెందిన డాక్టర్‌ వెల్మల మధు ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వేలాది మంది పోటీ పడిన డీఎల్‌ పరీక్షలో ఆయన ఎందర్నో వెనక్కినెట్టి ఉద్యోగం సంపాదించుకున్నారు. ఆయన ఒకప్పుడు ఇంటర్‌లో పరీక్ష తప్పాడు. డిగ్రీలోనూ అంతే ముందుకెళ్లలేకపోయాడు. తనవల్ల కాదని ప్రయివేటులో చిన్నాచితక ఉద్యోగాలు చేస్తూ పోయాడు. కొన్నేళ్ల తర్వాత తనమిత్రులను చూసి స్ఫూర్తిని పొందాడు. ఆగిన చదువును పట్టాలెక్కించి డిగ్రీ నుంచి వృక్షశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందేదాకా ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం వివిధ అంశాలలో ప్రావీణ్యం సంపాదించి అనేక పరిశోధన పత్రాలను, అంతర్జాతీయ స్థాయిలో సమర్పిస్తూ రాణిస్తున్నారు.

క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు

క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. స్థిరంగా ఆలోచించుకోవాలి. మార్కులు, ర్యాంకులు కొలమానం కాదు. చదువుల్లో రాణించని ఎందరో ప్రముఖులు తాము ఎంచుకున్న ప్రత్యామ్నాయ రంగాల్లో ఉన్నతంగా ఎదిగిన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండేలా విద్యార్థులు, యువతకు తల్లిదండ్రలే మార్గనిర్దేశనం చేయాలి. – మోత్కురి రాంచందర్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top