ఇల్లరికం వచ్చి.. ఇల్లాలిని కడతేర్చాడు | - | Sakshi
Sakshi News home page

ఇల్లరికం వచ్చి.. ఇల్లాలిని కడతేర్చాడు

Oct 4 2026 10:19 AM | Updated on Oct 4 2026 10:19 AM

● భార్యపై అనుమానంతో రోకలిబండతో బాది చంపిన భర్త

● ఓబులోనిపల్లిలో విషాధ ఘటన

● పరారీలో నిందితుడు

● ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

ధరూరు: ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉండడంతో ఇల్లరికం వచ్చిన ఓ వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకుని రోకలిబండతో తలపై బాది చంపిన విషాధ ఘటన మండలంలోని ఓబులోనిపల్గిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ నర్సింహులు, అనంతమ్మ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. వారితో పెద్ద కూతరైన జమ్ములమ్మ(37)ను ఇంటికి పెట్టుకుని 20ఏళ్ల కిందట గట్టు మండలం ఆలూరుకు చెందిన గోపిని ఇళ్లరికం తెచ్చుకున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. రెండో కూతురును గట్టు మండలం రాయపురం గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జమ్ములమ్మపై భర్త గోపి కొన్నిరోజులుగా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై పలుమార్లు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. శనివారం ఉదయం 9గంటల సమయంలో ఇంటి నుంచి కూతురు కూలీ పనులకు వెళ్లడంతో ఇంటి వద్ద ఉన్న జమ్ములమ్మపై రోకలిబండ, గొడ్డలితో తలపై బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లి చూడగా.. జములమ్మ రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించింది. విషయాన్ని రేవులపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి శవాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఓబులోనిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రి వద్ద మృతురాలు కుటుంబ సభ్యుల రోధలు మిన్నంటాయి. బాధిత కుటంబ సభ్యులను వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి పరామర్శించారు. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదమే ఘటనకు కారణమా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతురాలి భర్త, నిందితుడు గోపి పారారీలో ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement