కందనూలు: మంచి పుస్తకాలు జీవితాలను ప్రభావితం చేస్తాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్‌కుమార్ రచించిన ‘జీరో గ్రావిటీ–కవిత్వం’ పుస్తకాన్ని శుక్రవారం హైదరాబాద్ బర్కత్‌పురలోని తన క్యాంపు కార్యాలయంలో కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలకు పైగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో బోధనా అనుభవంతోపాటు జాతీయత, మానవత, శాసీ్త్రయ, పర్యావరణ, సామాజిక స్పృహతో పలు రచనలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ‘శూన్యం–కవిత్వం’, ‘బిగ్ బ్యాంగ్–వ్యాసాలు’ పుస్తకాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. వివేకానంద, గాంధీజీ, ఠాగూర్, శ్రీనివాస రామానుజన్, సీవీ రామన్, నేతాజీ, భగత్‌సింగ్, విక్రమ్ సారాభాయ్, కల్పనా చావ్లా, అబ్దుల్ కలాం తదితర మహనీయుల స్ఫూర్తితో రచనలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అరుణ్‌కుమార్ భవిష్యత్తులో దేశభక్తి, యువతకు ప్రేరణ కలిగించే రచనలు చేయాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోటగిరి రాజేష్‌కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కొంజర్ల శ్రీనివాస్, బీజేపీ టీచర్స్ స్టేట్ కన్వీనర్ అన్నెబోయిన నారాయణగౌడ్, శ్యాంసుందర్‌గౌడ్, భరత్‌గౌడ్, నందనం దివాకర్, వీరెల్లి చంద్రశేఖర్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


