దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన ఉల్లి వేలంలో ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా అటూ ఇటుగా నమోదయ్యాయి. అయితే నాలుగు వారాలుగా ఉల్లి ధరలు పెరుగుతూనే ఉండటంతో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. రైతులు ఊహించని స్థాయిలో కనిష్ట ధరలు సైతం పలుకుతున్నాయి. బుధవారం క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.5,300, కనిష్టంగా రూ.4,100 ధర పలికింది. మార్కెట్‌కు కేవలం 200 బస్తాల ఉల్లి మాత్రమే విక్రయానికి వచ్చింది. తూకం అనంతరం 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.2,700, కనిష్టంగా రూ.2,100 చొప్పున అమ్ముడైంది. మార్కెట్‌కు ఉల్లి దిగుబడి తక్కువగా రావడంతో చిరు వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేశారు. దీంతో వినియోగదారులకు ఉల్లి లభ్యత తగ్గింది. దేవరకద్ర సంతలో కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయించారు.


