27 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. 1,758 క్యూసెక్కులు విడుదల
గద్వాల: కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి వరద వదలడంతో మూడోరోజు స్థిరంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాలను తాకింది. ఈ క్రమంలో సోమవారం జూరాలకు ఇన్‌ఫ్లో రూపంలో 27 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జూరాల జలాశయంలో 318.010 మీటర్ల వద్ద 8.631 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో స్పిల్‌వే ద్వారా దిగువకు ఎలాంటి వరద నీటిని విడుదల చేయడం లేదు. అదేవిధంగా హైడల్ ప్రాజెక్టుకు నీటిని వదలడం లేదు. కాగా.. నెట్టెంపాడు కాల్వకు 750 క్యూసెక్కులు, భీమాకు 650 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 27 వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో రూపంలో 1,758 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
పస్పుల ఘాట్‌కు తాకిన వరద
మక్తల్: ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతుండటంతో క్రమంగా కృష్ణానదిలో నీటిమట్టం పెరుగుతోంది. సోమవారం మక్తల్ మండలంలోని పస్పుల ఘాట్‌కు వరద తాకుతూ పారుతుంది. పస్పుల వద్ద కృష్ణానది అర కి.మీ., దూరంలో రెండు పాయలుగా చీలిపోయి ప్రవహిస్తుంది. కృష్ణానదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉండాలని అధికారులు సూచించారు.
గుడ్డెందొడ్డి రిజర్వాయర్
మక్తల్: మండలంలోని చిన్నగోప్లాపూర్ పంపు వద్ద ఫేజ్–1 ద్వారా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తమ్ముడు వాకిటి శేషగిరి సోమవారం మోటార్లను ఆన్ భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు. అలాగే స్టేజ్–2 పంపుహౌజ్‌లో డీఈ వెంకటరమణ పంపును ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణానదికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో రెండు పంపుహౌజ్‌ల నుంచి మోటార్లను ఆన్ చేసి నీటిని వదిలినట్లు చెప్పారు. వీటి ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపి ఆయకట్టు పొలాలకు నీటిని విడుల చేస్తామని వారు పేర్కొన్నారు. భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు వెంకటేస్, సురేష్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.


