● అదృశ్యం కేసు దర్యాప్తులో వెలుగులోకి..
● ముగ్గురు నిందితుల అరెస్టు
● బంగారు, వెండి ఆభరాలు స్వాధీనం
నారాయణపేట/కొత్తపల్లి:బంగారు నగలు దోచుకునేందుకు ముందస్తు పథకం రచించి మహిళను హ త్య చేసిన ఘటన జిల్లాలోని మద్దూర్ పోలీస్ స్టేషన్‌న పరిధిలో వెలుగుచూసింది. మద్దూరు మండలం జాదవరావుపల్లి గ్రామానికి చెందిన గొయి కల శాంతమ్మ (45) అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ దా రుణం బయటపడింది. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు సంబంధించిన వివరాలను ఎస్పీ వినీత్ వెల్లడించారు.
దర్యాప్తుతో మిస్టరీ ఛేదన..
శాంతమ్మ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 15న మద్దూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మిస్సింగ్ కేసుపై చర్యలు తీసుకోవడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ బాస్‌ను కలిసి తమ గోడును వినిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నారాయణపేట మండలం జాజాపూర్ చెరువులో ఓ మహిళ మృతదేహం తేలడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పథకం ప్రకారం హత్య జరిగినట్లు గుర్తించారు.
ముందస్తు పథకం ప్రకారం..
మద్దూర్ మండలం పెదూరుపాడుకు చెందిన జోగు రాజు, బడుగుల భాస్కర్, శాంతమ్మ దూరపు బంధువులు. ఈ నేపథ్యంలో ఆమె వద్ద ఉన్న నగలు దోచుకునేందుకు ముందుగానే పథకం వేశారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఆమెను మద్దూర్‌కు రప్పించి బైక్‌పై జాజాపూర్ చెరువు సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగి శాంతమ్మను హత్య చేశారు. అనంతరం మృతురాలి వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్, పర్సు, ఆధార్ కార్డును తీసుకొని ఆధారాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో వాటిని బోరు కేసింగ్‌లో పడేశారు. ఆభరణాలను నారాయణపేటలో విక్రయించి వచ్చిన నగదు పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి తులం బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు, రెండు బైక్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేటలోని సరాఫ్ బజార్‌లో దొంగలించిన ఆభరణాలు కొనుగొలు చేసిన జాజాపూర్ కృష్ణ అనే వ్యాపారిని కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్య కేసు ఛేధించిన కోస్గి సీఐ సైదులు, మద్దూర్ ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బందిని ఎస్పీ వినీత్ ప్రత్యేకంగా అభినందించారు.
స్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్యాయత్నం?
మహిళ హత్య కేసులో నిందితుల్లో ఒకరు రెండు రోజుల క్రితం మద్దూర్ పోలీస్‌స్టేషనన్‌లో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. టవల్‌ను కిటికీకి కట్టి గొంతుకు ఉరేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. గమనించిన పోలీసులు అప్రమత్తమై అతడిని రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది.


